old women murder
-
90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. హత్య
హాలియా: సభ్యసమాజం తలదించుకునే విధంగా ఓ కామాంధుడు 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు (90)కి నలుగురు కుమారులు. వారికి వివాహాలై వేరుగా ఉంటున్నా రు. భర్త చనిపోవడంతో వృద్ధురాలు గ్రామ శివారులోని ఓ గుడిసెలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆదివారం కుటుంబ సభ్యులు వృద్ధురాలి గుడిసె వద్దకు వెళ్లి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె పెద్ద కుమారుడికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద కుమారుడు ప్రయత్నించగా నేలపై రక్తపు మరకలు కనిపించాయి. మృతదేహంపై గాయాలు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామానికి చెందిన సత్రశాల శంకర్ మద్యం సేవించి వృద్ధురాలి గుడిసె చుట్టూ పలుమార్లు తిరిగాడని, అతడే తన తల్లిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు పెద్ద కుమారుడు లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శంకర్ గతంలోనూ గ్రామంలోని ఓ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. -
వృద్ధురాలి హత్య
రాజంపేట రూరల్: రాజంపేటలో ఓ వృద్ధురాలి హత్య సంచలనం సృష్టించింది. అందరితో కలివిడిగా ఉండే నర్రెడ్డి సుమిత్రమ్మ(63)ను దుండగులు హతమార్చిన తీరు భయాందోళన రేకెత్తించింది. గతంలో సుజాత అనే మహిళపై అత్యాచారం చేసి హతమార్చి దోపిడీకి పాల్ప డిన దారుణ సంఘటన మరువక ముందే మరో హత్య జరగడం చర్చనీయాంశమైంది. ఈ కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. ఎర్రబల్లిలో కుమారుడి కుటుంబంతో ఉండే సుమిత్రమ్మకు ధైర్యవంతురాలిగా పేరుంది. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. భర్త వీరనారాయణరెడ్డి చనిపోయాక కుటుంబానికి అన్నీ తానే అయ్యింది. పిల్లలకు చదువులు చెప్పించింది. కుమార్తెకు పెళ్లి చేసింది. కుమార్తె అమెరికాలో ఉంటోంది.. కొడుకు మహీధర్‌రెడ్డి కారు బాడుగపై తిప్పుతుంటాడు. కోడలు పుట్టింటికి వెళ్లడం.. మహీధరరెడ్డి రాజమండ్రి వెళ్లడంతో సుమిత్రమ్మ శుక్రవారం ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈమె ఒంటరిగా ఉండటం తొలిసారి కాదు. ఆమెకు భయం కూడా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంటికి భద్రంగా తాళాలు వేసుకుని పడుకునేదని ఇరుగుపొరుగువారన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి దుండగులు ఇంట్లో చొరబడి సుమిత్రమ్మను చీర కొంగు మెడకు చుట్టి హత్య చేసి 500 గ్రాముల బంగారం, 2 లక్షల రూపాయల నగదు తీసుకెళ్లిపోయారు. దుండగులు కనీస క్లూ బయటపడకుండా ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసు జాగిలం ఉస్మాన్‌నగర్ వరకూ వెళ్లి వచ్చేసినట్లు తెలిసింది. డీఎస్పీ మురళీధర్, రూరల్ సీఐ నరసింహులు, ఎస్ఐలు. ఖాజాహుస్సేన్, మహేష్‌నాయుడు, ఏఎస్ఐ మల్లిరెడ్డి శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో సీసీ కెమెరాలు అమర్చినా నిర్వహణ విషయంలో పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. నిఘా విషయంలో పోలీసులు విఫలం అవడం వలనే ఇలాంటి దురాగతాలకు దొంగలు తెగబడుతున్నారని వారు అంటున్నారు. గతంలో ఇదే తరహాలో సుజాత అనే మహిళ హత్యకు గురైంది. ఐదు నెలలు అవుతున్నా హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. కేవలం బంధువులను, చుట్టు పక్కల వారిని విచారించి కేసు వదిలేసినట్లు ఉందని జనం వ్యాఖ్యానిస్తున్నారు. సరైన కోణంలో దర్యాప్తు చేపట్టలేకపోయారనే అపప్రధ ఉంది. పథకం ప్రకారమే హత్య ఒక పథకం ప్రకారం మాటువేసి ఒంటరి మహిళలను మట్టు బెట్టుతున్నారని జనం ఆందోళన చెందుతున్నారు. రోజూ తానే జాగ్రత్తగా అన్ని తాళాలు వేసి సుమిత్రమ్మ పడుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలిసిన వారు చేశారా లేక దొంగలు రెక్కి నిర్వహించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. సుమిత్రమ్మ బాత్రూముకు వెళ్లిన సమయంలో ఇంటిలోకి దుండగలు చొరబడి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇంటిలోపలి భాగంలో బాత్రూము లేదు. తలుపులు తీసుకొని వెలుపలికి రావల్సిందే. కాగా ఈమెను అత్యాచారం చేసి హత్యా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిసింది. స్థానికంగా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు సత్వరం స్పందించి పట్టణ వాసులకు భద్రత కల్పించాల్సి న అసవసరముంది. -
‘అమ్మా’నుషం
ఉప్పరపల్లె (పెనగలూరు): నవ మాసాలూ మోసి, కనిపెంచింది. సంతానమే సంపదగా భావించింది. అయితే వృద్ధాప్యంలో ఆమె బిడ్డలకు భారమైపోయింది. అమ్మను పెంచడానికి నెలకొకరు వాటాలు వేసుకున్నారు. అలా కూడా ఆమె జీవితం సాఫీగా సాగలేదు. వయసుపైనబడ్డంతో అన్నీ మంచంమీదే. బతుకు దుర్భరంగా మారింది. దీంతో ఇలాంటి తల్లిని పెంచడం భారమనుకున్నాడో తనయుడు. గొంతు నులిమి హత్య చేశాడు. రెండు రోజుల తర్వాత ఈ సంఘటన బయటపడింది. పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ ఉప్పరపల్లెకి చెందిన ఊటుకూరు సిద్దమ్మ (85)కు ఐదుగురు కుమారులున్నారు. ముగ్గురు కుమార్తెలున్నారు.వయోభారంతో ఆమె భర్త చనిపోయాడు. సిద్ధమ్మ ఒంటరయింది. దీంతో అన్నీ తామై సాకాల్సిన బిడ్డలు ఆమెను చూడ్డానికి వంతులు వేసుకున్నారు. ఈ వృద్ధురాలిని ఒక ఇంట్లో ఉంచుతున్నారు. ఆలనాపాలనా నెలకు ఒక కుమారుడు చూస్తున్నారు. ఇటీవల వయో భారంతో ఈమెకు ఆరోగ్యం పాడయ్యింది. తన పనులు సొంతంగా వృద్ధురాలు చేసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో తల్లిని చూసే బాధ్యత మూడో కుమారుడు సుబ్బారెడ్డికి వచ్చింది. ఇదేసమయంలో చిన్న కుమారుడు రామచంద్రారెడ్డి తల్లిపై ద్వేషం పెంచుకున్నాడు. తమకు అడ్డంకిగా తయారైందని భావించాడు. ప్రాణం తీసేసి మామూలుగా చనిపోయిందని చెబుదామని పథకం పన్నాడు. ఆదివారం అర్థరాత్రి గొంతు నులిమి చంపేశాడు. అందరికీ అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించాడు. అంత్యక్రియలు కూడా నిర్వహించారు. రీ పోస్టుమార్టం వద్ద పోలీసు అధికారులు వృద్దురాలుంటున్న ఇంటికి సంబంధించి గతంలో సీసీ కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాతో తన మొబైలు ఫోనుకు అనుసంధానం చేసుకున్నాడు గల్ఫ్‌లో ఉంటున్న మనుమడు. అతడు అనుమానించి కెమెరా దృశ్యాలను తేరిపారా చూశాడు. గొంతు నులిమి చంపేసినట్లు అందులో కనిపించింది. ఈలోగా గల్ఫుకు చిన్న కుమారుడు రామచంద్రారెడ్డి ఆదరాబాదరాగా మూటాముల్లె సర్దేయడం అందరికీ అనుమానం కలిగించింది. పోలీసులకు ఈ సమాచారం సోకింది. వెంటనే వారు రంగ ప్రవేశం చేశారు. విచారణ జరిపారు. సీసీ కెమెరా దృశ్యాల విషయాలు బయటకు వచ్చాయి. సిద్ధమ్మ మృతదేహానికి డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో డాక్టర్ సాధిక్ రీపోస్టుమార్టం నిర్వహించారు. వృద్ధురాలు ఊపిరి ఆడక మరణించినట్లు వైద్యుల నివేదికలో తేలినట్లు తెలిసింది. పూర్తి రిపోర్టు రావల్సి ఉంది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడ్ని..సహకరించినవారిని తప్పకుండా అరెస్టు చేస్తామని డీఎస్పీ మురళీధర్ చెప్పారు. ఎస్ఐ వెంకటరమణ సీఐ, డీఎస్పీల సహకారంతో రాత్రంతా శ్రమించి కేసును ఛేదించారు. -
వృద్ధురాలి హత్య
డబ్బు ఇవ్వలేదని కర్రతో కొట్టిచంపిన వైనం కొనకనమిట్ల మండలం తువ్వపాడులో ఘటన తువ్వపాడు (కొనకనమిట్ల) : డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధురాలిపై కర్రతో దాడిచేసి హత్యచేసిన సంఘటన కొనకనమిట్ల మండలం తువ్వపాడు గ్రామం పడమటిపల్లిలో జరిగింది. పొదిలి సీఐ రవిచంద్ర, కొనకనమిట్ల ఎస్సై మస్తాన్‌షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం... తువ్వపాడు పడమటిపల్లికి చెందిన మొండెద్దు లక్ష్మమ్మ (70) ఒంటరిగా ఉండేది. ఆమె కుమారుడు గాలిరెడ్డి వృత్తిరీత్యా గుంటూరులో ఉంటున్నాడు. కాగా, గ్రామానికి చెందిన కేసరి కొండారెడ్డి ఇంటికి అప్పుడప్పుడూ లక్ష్మమ్మ వెళ్తుండేది. ఈ నేపథ్యంలో గత నెల 27వ తేదీ లక్ష్మమ్మను కొండారెడ్డి కొంత డబ్బు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఆగ్రహించి కర్రతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను బంధువులు ఒంగోలులోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై 28న కొనకనమిట్ల పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. లక్ష్మమ్మ కుమారుడు గాలిరెడ్డి వచ్చి మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను గుంటూరు తీసుకెళ్లాడు. అయినప్పటికీ వైద్యులు లాభం లేదని చెప్పడంతో గురువారం ఆమెను తువ్వపాడు తీసుకొచ్చారు. ఇంటికొచ్చిన కొద్దిసేపటికే లక్ష్మమ్మ మృతిచెందింది. ఆమె కుమారుడు గాలిరెడ్డి ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ రవిచంద్ర, కొనకనమిట్ల ఎస్సై మస్తాన్‌షరీఫ్‌లు తువ్వపాడు వచ్చి విచారించారు. నిందితుడు కొండారెడ్డిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.