ఉప్పరపల్లె (పెనగలూరు): నవ మాసాలూ మోసి, కనిపెంచింది. సంతానమే సంపదగా భావించింది. అయితే వృద్ధాప్యంలో ఆమె బిడ్డలకు భారమైపోయింది. అమ్మను పెంచడానికి నెలకొకరు వాటాలు వేసుకున్నారు. అలా కూడా ఆమె జీవితం సాఫీగా సాగలేదు. వయసుపైనబడ్డంతో అన్నీ మంచంమీదే. బతుకు దుర్భరంగా మారింది. దీంతో ఇలాంటి తల్లిని పెంచడం భారమనుకున్నాడో తనయుడు. గొంతు నులిమి హత్య చేశాడు.
రెండు రోజుల తర్వాత ఈ సంఘటన బయటపడింది. పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ ఉప్పరపల్లెకి చెందిన ఊటుకూరు సిద్దమ్మ (85)కు ఐదుగురు కుమారులున్నారు. ముగ్గురు కుమార్తెలున్నారు.వయోభారంతో ఆమె భర్త చనిపోయాడు. సిద్ధమ్మ ఒంటరయింది. దీంతో అన్నీ తామై సాకాల్సిన బిడ్డలు ఆమెను చూడ్డానికి వంతులు వేసుకున్నారు. ఈ వృద్ధురాలిని ఒక ఇంట్లో ఉంచుతున్నారు. ఆలనాపాలనా నెలకు ఒక కుమారుడు చూస్తున్నారు.
ఇటీవల వయో భారంతో ఈమెకు ఆరోగ్యం పాడయ్యింది. తన పనులు సొంతంగా వృద్ధురాలు చేసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో తల్లిని చూసే బాధ్యత మూడో కుమారుడు సుబ్బారెడ్డికి వచ్చింది. ఇదేసమయంలో చిన్న కుమారుడు రామచంద్రారెడ్డి తల్లిపై ద్వేషం పెంచుకున్నాడు. తమకు అడ్డంకిగా తయారైందని భావించాడు. ప్రాణం తీసేసి మామూలుగా చనిపోయిందని చెబుదామని పథకం పన్నాడు. ఆదివారం అర్థరాత్రి గొంతు నులిమి చంపేశాడు. అందరికీ అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించాడు. అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
రీ పోస్టుమార్టం వద్ద పోలీసు అధికారులు
వృద్దురాలుంటున్న ఇంటికి సంబంధించి గతంలో సీసీ కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాతో తన మొబైలు ఫోనుకు అనుసంధానం చేసుకున్నాడు గల్ఫ్‌లో ఉంటున్న మనుమడు. అతడు అనుమానించి కెమెరా దృశ్యాలను తేరిపారా చూశాడు. గొంతు నులిమి చంపేసినట్లు అందులో కనిపించింది. ఈలోగా గల్ఫుకు చిన్న కుమారుడు రామచంద్రారెడ్డి ఆదరాబాదరాగా మూటాముల్లె సర్దేయడం అందరికీ అనుమానం కలిగించింది. పోలీసులకు ఈ సమాచారం సోకింది. వెంటనే వారు రంగ ప్రవేశం చేశారు. విచారణ జరిపారు.
సీసీ కెమెరా దృశ్యాల విషయాలు బయటకు వచ్చాయి. సిద్ధమ్మ మృతదేహానికి డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో డాక్టర్ సాధిక్ రీపోస్టుమార్టం నిర్వహించారు. వృద్ధురాలు ఊపిరి ఆడక మరణించినట్లు వైద్యుల నివేదికలో తేలినట్లు తెలిసింది. పూర్తి రిపోర్టు రావల్సి ఉంది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడ్ని..సహకరించినవారిని తప్పకుండా అరెస్టు చేస్తామని డీఎస్పీ మురళీధర్ చెప్పారు. ఎస్‌ఐ వెంకటరమణ సీఐ, డీఎస్పీల సహకారంతో రాత్రంతా శ్రమించి కేసును ఛేదించారు.
Comments
Please login to add a commentAdd a comment