డబ్బు ఇవ్వలేదని కర్రతో కొట్టిచంపిన వైనం
కొనకనమిట్ల మండలం తువ్వపాడులో ఘటన
తువ్వపాడు (కొనకనమిట్ల) : డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధురాలిపై కర్రతో దాడిచేసి హత్యచేసిన సంఘటన కొనకనమిట్ల మండలం తువ్వపాడు గ్రామం పడమటిపల్లిలో జరిగింది. పొదిలి సీఐ రవిచంద్ర, కొనకనమిట్ల ఎస్సై మస్తాన్‌షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం... తువ్వపాడు పడమటిపల్లికి చెందిన మొండెద్దు లక్ష్మమ్మ (70) ఒంటరిగా ఉండేది. ఆమె కుమారుడు గాలిరెడ్డి వృత్తిరీత్యా గుంటూరులో ఉంటున్నాడు. కాగా, గ్రామానికి చెందిన కేసరి కొండారెడ్డి ఇంటికి అప్పుడప్పుడూ లక్ష్మమ్మ వెళ్తుండేది. ఈ నేపథ్యంలో గత నెల 27వ తేదీ లక్ష్మమ్మను కొండారెడ్డి కొంత డబ్బు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఆగ్రహించి కర్రతో తలపై కొట్టాడు.
తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను బంధువులు ఒంగోలులోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై 28న కొనకనమిట్ల పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. లక్ష్మమ్మ కుమారుడు గాలిరెడ్డి వచ్చి మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను గుంటూరు తీసుకెళ్లాడు. అయినప్పటికీ వైద్యులు లాభం లేదని చెప్పడంతో గురువారం ఆమెను తువ్వపాడు తీసుకొచ్చారు. ఇంటికొచ్చిన కొద్దిసేపటికే లక్ష్మమ్మ మృతిచెందింది. ఆమె కుమారుడు గాలిరెడ్డి ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ రవిచంద్ర, కొనకనమిట్ల ఎస్సై మస్తాన్‌షరీఫ్‌లు తువ్వపాడు వచ్చి విచారించారు. నిందితుడు కొండారెడ్డిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వృద్ధురాలి హత్య
Published Fri, Jul 10 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement