
సెల్‌కు ఓటీపీ రావడం లేదు. అయినా ఖాతాల్లో సొమ్ములు క్షణాల్లో మాయమవు తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరు తీస్తున్నారో తెలుసుకునే లోపు మొత్తం నగదు మాయమవుతున్నాయి. నిన్న రాజమహేంద్ర వరంలోని పలువురి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు మాయం కాగా.. తాజాగా మరో బాధితుడు చేరాడు. మామిడికుదురుకు చెందిన ఓ వ్యక్తి ఖాతాలోని సుమారు రూ.31 వేల నగదు మాయం కావడంతో అతడు లబోదిబోమంటున్నాడు.
మామిడికుదురు (పి.గన్నవరం): బ్యాంకు ఖాతా నుంచి రూ.31,676 చోరీ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు విడతలుగా రూ.7900 వంతున తన ఖాతా నుంచి చోరీ జరిగిందని మామిడికుదురుకు చెందిన శిరిగినీడి శ్రీరామకృష్ణ నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల పదో తేదీ రాత్రి 9.38 గంటల సమయంలో ఈ చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రామకృష్ణకు అమలాపురం కె.అగ్రహారం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఈ ఖాతా నుంచి ముందుగా రూ.76వేలు డ్రా చేశారు. వెనువెంటనే ఆ మొత్తం తిరిగి అక్కౌంట్‌కు జమ అయ్యిందని రామకృష్ణ తెలిపారు. వెను వెంటనే రూ.7900 వంతున నాలుగు విడతల్లో రూ.31,676 తన ఖాతా నుంచి విత్‌డ్రా అయ్యిందని చెప్పారు. దీనికి సంబంధించి తన సెల్‌కు మెసేజ్ వచ్చిందన్నారు. వెంటనే తన ఖాతాను బ్లాక్ చేయించానని చెప్పారు. ఆన్‌లైన్‌లో స్టేట్‌మెంట్ తీయగా డెబిట్ కార్డు ఉపయోగించి ఈ మొత్తాన్ని డ్రా చేసినట్టుగా వచ్చిందన్నారు. తన సెల్‌కు ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకుండానే ఆన్‌లైన్ ద్వారా ఈ మొత్తాన్ని చోరీ చేశారని వాపోయాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ లావాదేవీలపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై బ్యాంకు అధికారులకు, నగరం పోలీసులకు ఫిర్యాదు చేశానని రామకృష్ణ తెలిపారు. ఇటువంటి మోసాలు జరగకుండా బ్యాంకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.