
జవహార్‌నగర్: కన్న తండ్రే కుమారుని కర్కశంగా చితకబాదుతుండగా, అందుకు అతడి తల్లి కూడా సహకరించిన సంఘటన జవహర్‌నగర్ పరిధిలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని చూసిన స్థానికులు బుధవారం జవహార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్ కాలనీకి చెందిన ప్రహ్లాద్ దంపతుల కుమారుడు శివమణి(14) కౌకూర్‌లోని పాఠశాలలో చదువుకుంటున్నాడు. ప్రహ్లాద్ తన కుమారుడు శివమణి(14)ని నిత్యం అకారణంగా చితకబాదేవాడు.
బుధవారం ఉదయం 6గంటల సమయంలో బాలుడిని చితకబాదడంతో అతడి ఒళ్లంతా కమిలిపోయింది. దెబ్బలను తాళలేక ఏడ్చుకుంటూ బయటికి పరిగెత్తడంతో గమనించిన స్థానికులు బాలుడిని ఎందుకు కొడుతున్నావని ప్రహ్లాద్‌ను నిలదీయగా పాఠశాలకు వెళ్లడం లేదంటూ సమాధానం ఇస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఏడుస్తూ అక్కడే ఉన్న శివమణిని అతని తల్లి ఉతికిన బట్టలు ఆరబెట్టాలని ఆదేశించడంతో అతను ఏడుస్తూనే ఆ పని పూర్తి చేశాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లమని స్థానికులు సూచించినా పట్టించుకోకుండా అతడిని ఇంట్లోకి తీసుకెళ్లింది. దీంతో స్థానికులు జవహార్‌నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ సైదులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడు, అతని తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment