కన్నబిడ్డను హత్య చేసిన కిరాతక తల్లిదండ్రులు చత్రియ, హేతురాం
ఇబ్రహీంపట్నం : నవమాసాలు మోసి కన్న బిడ్డనే... ఆ కసాయి తల్లి కడతేర్చింది. అల్లరి చేస్తుందనే కారణంతో మూగ చెవుడుతో పుట్టిన ఏడేళ్ల కూతుర్ని అత్యంత అమానుషంగా ఇటుక రాయితో కొట్టి చంపింది. ఆనక భర్తతో కలిసి మృతదేహాన్ని పాతి పెట్టి అదృశ్యమైందంటూ డ్రామాలాడింది.
మానవత్వాన్ని ఎక్కిరించే ఈ సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు బల్లటి చత్రియ, హేతురాంలు యాచారం మండల పరిధిలోని చింతుల్ల శివార్లలోని బీఎన్‌సీ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. 5 నెలల క్రితమే వీరు వచ్చారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడున్నారు.
మూగ చెవుడుతో పుట్టిన ఏడేళ్ల ఊర్మిళ వీరికి మూడో సంతానం. మూగచెవుడు కావడం, ఈ చిన్నారి అల్లరి ఎక్కువగా చేస్తుండటం.. పొరుగువారితో తరచూ గొడవ పడుతుండటంతో తల్లి చత్రియ(39) బిడ్డను చంపాలని నిర్ణయించుకుంది.
దీంతో 26వ తేదీ మధ్యాహ్నం ఆ చిన్నారి గుడిసెలో నిద్రిస్తుండగా ఇటుకతో తలపై కొట్టి చంపింది. సమీపంలోని చెట్టుకింద నిద్రిస్తున్న భర్త హేతురాంను లేపి ఈ విషయాన్ని చెప్పింది. మృతదేహన్ని ఏం చేయాలో వారికి అర్థంకాలేదు.
దీంతో సమీపంలోని ఇటుకబట్టీల్లో కాల్చేసిన బూడిద పొట్టు కుçప్పను తవ్వి అందులో చిన్నారి మృతదేహాన్ని తండ్రి హేతురాం పాతిపెట్టాడు. అనంతరం చిన్నారి తప్పిపోయిందంటూ డ్రామాలాడారు తప్ప పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు.
ఈ విషయం తెలిసిన బట్టీ యాజమాని ఆ చిన్నారి తల్లిదండ్రులతో 27న యాచారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐ కృష్ణంరాజుకు తల్లిదండ్రులపైనే అనుమానం కలిగింది.
ఇటుక బట్టీల వద్ద దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. తల్లి చత్రియను బిడ్డ ఎక్కడుందో చెప్పాలని గట్టిగా అడుగగా... కాల్చి ఉన్న పొట్టు కుప్పలో ఆ చిన్నారి చేయి కనబడుతుందని పోలీసులకు తెలిపింది.
అక్కడికి వెళ్లి తవ్విచూడగా ఊర్మిళ మృతదేహం లభ్యమైంది. కానీ తల్లిదండ్రుల్లో బిడ్డ చనిపోయిన బాధ కలగకపోవడంతో వారిపై మరింత అనుమానం పోలీసులకు బలపడింది. డాగ్ స్క్వాడ్స్‌ను రప్పించగా సమీపంలోని చత్రియ గుడిసెలోకి వెళ్లింది.
పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా తల్లిదండ్రులే ఆ చిన్నారిని హతమార్చారని తేలింది. దీంతో చత్రియ, హేతురాం(45)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును సమయస్ఫూర్తితో ఛేదించిన సీఐ కృష్ణంరాజును ఏసీపీ మల్లారెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment