
బసవమ్మ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, స్థానికులు
నిజాంపట్నం (రేపల్లె): అత్తపై అల్లుడు దాడి చేసి హతమార్చిన సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం సంజీవనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, కొత్తపాలెం పంచాయతీ కొత్తూరుకు చెందిన కొక్కిలిగడ్డ వెంకట బసవమ్మ (60) కుమార్తె వెంకట నాగేశ్వరికి, అదే గ్రామానికి చెందిన వాటుపల్లి వెంకటకృష్ణకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. నాగేశ్వరి, వెంకటకృష్ణల మధ్య తరచూ వివాదాలు జరగడం, పెద్దమనుషులు సర్దిచెప్పి కాపురానికి పంపించడం జరుగుతుండేది. 15 రోజుల క్రితం వెంకటనాగేశ్వరి భర్తతో వివాదం రావడంతో పుట్టింటికి వచ్చి తల్లి వెంకట బసవమ్మ దగ్గర ఉంటోంది. వెంకట బసవమ్మ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటోంది.
అయితే వెంకటకృష్ణ తన భార్యను తన వద్దకు రానీయకుండా అత్త అడ్డుపడుతోందని భావించి అత్తపై కక్ష పెంచుకున్నాడు. బసవమ్మ శుక్రవారం సంజీవనగర్‌లో నిర్మాణం జరుగుతున్న తుపాను షెల్టర్ భవనం వద్ద కూలిపనులకు వెళ్లింది. మరో ఆరుగురు కూలీలతో పాటు అక్కడ పనిచేస్తుండగా అల్లుడు వెంకటకృష్ణ అక్కడకు వెళ్లి అకస్మాత్తుగా మారణాయుధంతో దాడిచేసి బసవమ్మను హతమార్చాడు. బసవమ్మకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని రేపల్లె సీఐ పెంచలరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.