ఎర్రచందనం కూలీల అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న మాట్లాడుతున్న ఎస్సై వేణు
కావలిరూరల్/సంగం/దుత్తలూరు: జిల్లాలో ఆత్మకూరు, దుత్తలూరు పరి ధిలో అటవీ ప్రాంతంపై అటవీశాఖ, పోలీసులు నిఘా ఉంచి సోమవారం తెల్లవారుజామున ఏకకాలంలో ఎర్రస్మగ్లర్లపై మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు రూ.70 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కావలి, సంగం, దుత్తలూరు ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న 27 మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. కావలి సమీపంలోని ముసుసూరు వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 10 దుంగలతోపాటు 10 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. దుంగలు తరలిస్తున్న రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంగం చెక్‌పోస్టు వద్ద సోమవారం తెల్లవారుజామున ఎస్సై వేణు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దుంగలు తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరు– ముంబాయి జాతీయ రహదారిపై ఓ ఇన్నోవా వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి సంగం పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై వేణు తన సిబ్బందితో చెక్‌పోస్టు వద్ద మాటు వేసి ఇన్నోవా వాహనాన్ని నిలిపి తనిఖీలు చేపట్టారు. అందులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీలతో పాటు నెల్లూరుకు చెందిన వ్యాపారి వెంకటేశ్వర్లు, ఇన్నోవా డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. దుత్తలూరు అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారంతో ఎస్సై ఎం.వెంకటరాజేష్ సోమవారం తెల్లవారుజామున నందిపాడు కస్తూర్బా పాఠశాల సమీపంలో పోలీసు నిఘా ఉంచగా ఓ కారును తనిఖీ చేయగా, అందులో 18 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న 8 మంది కూలీలను, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది34 కేసులు నమోదు
ఎర్రచందనం స్మగ్లర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు స్మగ్లర్ల ఆస్తులు సీజ్ చేస్తామని జిల్లా క్రైమ్ ఓఎస్‌డీ విఠలేశ్వర్ తెలిపారు. సోమవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది 34 కేసులు నమోదు చేసి 590 మందిని అరెస్టు చేసి, 45 వాహనాలను సీజ్ చేశామన్నారు. మొత్తం రూ.16 కోట్ల విలువైన 16.32 టన్నుల ఎర్రచందనం దుంగలు, రూ.62,250 నగదు, రెండు ఎస్‌బీబీఎల్, 25 రివాల్వర్లను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి 14 కేసుల నమోదు చేసి 81 మందిని అరెస్ట్ చేసి 67 టన్నుల దుంగలు, 13 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లర్ల జాబితా తయారు చేసి వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. సమీపంలో ఎక్కడైనా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నా, లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే జిల్లా పోలీస్ వాట్సాప్ నంబరు 93907 77727కు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment