ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి పంట
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో సాగవుతున్న గంజాయి పంటను ధ్వంసం చేయడానికి ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్సు బృందాలు ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లోకి అడుగు పెట్టలేక పోయాయి. అక్టోబర్ నుంచి నాలుగు నెలల పాటు ఈ బృందాలు దాడులు నిర్వహించాల్సి ఉన్నా పట్టుమని పాతిక రోజులు కూడా చేయలేకపోయాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను గత సెప్టెంబర్‌లో మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో మన్యంలో గంజాయి సాగవుతున్న మారుమూల ప్రాంతాల్లోకి టాస్క్‌ఫోర్సు బృందాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఈఏడాది కేవలం 245 ఎకరాల్లో మాత్రమే గంజాయి పంటను ధ్వంసం చేయగలిగారు. విశాఖ ఏజెన్సీలోని ఎనిమిది మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయి పంట విరివిగా సాగవుతున్నట్టు అధికారికంగా గుర్తించారు. దీనిని మూడేళ్లలో పూర్తిగా నిర్మూలించాలన్నది లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతయ్యే గంజాయిలో అత్యధిక శాతం విశాఖ నుంచే జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, పోలీసు, అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు, సిబ్బందితో గత ఏడాది స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఏటా జులై, ఆగస్టుల్లో గంజాయి సాగు మొదలై నవంబర్/డిసెంబర్ నాటికి కోతకు వస్తుంది. దీనిని కొన్నాళ్లు ఆరబెట్టి ఎగుమతికి వీలుగా ప్యాకింగులు చేస్తారు.
దీంతో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు అక్టోబర్ నుంచి గంజాయి సాగవుతున్న ప్రాంతాలకు వెళ్లి ఆ పంటను ధ్వంసం చేయాల్సి ఉంది. ఇలా గత ఏడాది ఇదే టాస్క్‌ఫోర్స్ బృందాలు 3,125 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి తారుమారైంది. సెప్టెంబర్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య తర్వాత పోలీసులు మన్యంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలస్యంగా నవంబర్ 15 నుంచి టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు దాడులు మొదలు పెట్టాయి. ఈసారి దాడుల్లో రాష్ట్రంలోని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది మొత్తం150 మంది పాల్గొన్నారు. వీరితో పాటు ఇతర శాఖ సిబ్బంది కూడా ఉన్నారు. వీరు జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, మండలాల్లో మాత్రమే పోలీసుల నుంచి క్లియరెన్స్ లభించాక వీరు దాడులు చేశారు. మిగతా మండలాల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కొన్నిచోట్ల గంజాయి సాగుదార్లు ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలపై రాళ్లదాడికి కూడా తెగబడ్డారు. మధ్యమధ్యలో విరామం ఇస్తూ జనవరి మొదటి వారం వరకు అతికష్టమ్మీద కొనసాగించారు. ఇలా ఈ దఫా 245 ఎకరాల్లో మాత్రమే గంజాయి పంటను ధ్వంసం చేయగలిగారు. మరోవైపు మన్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది లోపలకు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది గంజాయి సాగును విస్తృతం చేసినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు రెండో ఏడాది గంజాయి సాగును నామమాత్రంగానే ధ్వంసం చేయగలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment