సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో శాంపిల్స్‌ను సేకరించింది. దీంతోపాటు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న హాస్టల్‌లోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ కాలిన గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను ఈ సీసీటీవీ కెమెరా నమోదుచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన అనంతరం కాలిన గాయాలతో నిందితుడు సురేష్ తాపీగా నడుచుకుంటూ వెళుతున్నట్టు ఈ దృశ్యాలలో కనిపిస్తోంది. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్, వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు. తహసీల్దార్ చంపేందుకు సురేష్ కిరోసిన్‌లో పెట్రోల్ కలిపి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు.
Comments
Please login to add a commentAdd a comment