సాక్షి, హైదరాబాద్ : రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. అంతే తప్ప.. ఫోర్జరీ వంటి ఆరోపణలపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అత్యవసర భేటీ
ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే సీఈవో తొలగింపు, కొత్త సీఈవో నియామకంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చర‍్చించనున్నట్లు తెలుస్తోంది. టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి నిన్నటి నుంచి విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment