
ప్రగతి (ఫైల్)
తరచూ ఫోన్ చేసి తనతోనే జీవిస్తానని తెలపడంతో..
సాక్షి, చెన్నై: పది సవర్ల నగల కోసం వేధించడంతో కళాశాల విద్యార్థిని ప్రగతిని హత్య చేసినట్లు నిందితుడు సోమవారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. తమిళనాడు దిండుగల్ జిల్లా ఒట్టనసత్రంకు చెందిన కళాశాల విద్యార్థిని ప్రగతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రగతి బంధువైన ఒట్టనసత్రంకు చెందిన సతీష్‌కుమార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సేకరించిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రగతి తన అత్త కుమార్తె అని, ఇద్దరూ చిన్ననాటి నుంచి ఇష్టపడినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రగతిని వివాహం చేసుకునేందుకు అత్తమామలను అడగ్గా, అందుకు వారు నిరాకరించినట్లు తెలిపాడు. దీంతో తన తల్లిదండ్రులు వేరొక యువతితో తనకు వివాహం జరిపించారని పేర్కొన్నాడు. (ఒన్ సైడ్ ఉన్మాదం)
గతంలో ప్రగతికి చీరలు, 10 సవర్ల బంగారు నగలు కొనిచ్చానని, తనకు బిడ్డ పుట్టిన తర్వాత ఆమెను కలవడం మానుకున్నట్లు తెలిపాడు. కానీ మరో పది సవర్ల బంగారు నగలు కొనివ్వాలని ప్రగతి బలవంతం చేసిందని తెలిపారు. ప్రగతి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అది తనకు ఇష్టం లేదని తెలిపినట్లు చెప్పాడు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా తనతో సంబంధం కొనసాగిస్తానని తెలిపిందని, తరచూ ఫోన్ చేసి తనతోనే జీవిస్తానని తెలపడంతో ఎక్కడ తన కుటుంబంలో చిచ్చు రేగుతుందనే అనుమానంతో ఆమెను హతమార్చేందుకు నిర్ణయించినట్లు తెలిపాడు. సంఘటన జరిగిన రోజున ఆమెను కారులో తీసుకువెళ్లి ఆమెతో ఉల్లాసంగా గడిపానని, తర్వాత తన వద్ద దాచుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి హతమార్చినట్లు తెలిపాడు. పోలీసులు సతీష్‌కుమార్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.