శాంతమ్మ మృతదేహం (ఇన్‌సెట్) శాంతమ్మ(ఫైల్) అనాథగా మారిన బాలుడు మహేంద్ర
కర్నూలు , ఆదోని: నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని జాలిమంచి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లి మృతిచెందడం.. తండ్రి హత్యారోపణలు ఎదుర్కొంటుండటంతో వారి ఏడాదిన్న చిన్నారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మృతురాలి తల్లిదండ్రులు, పెద్దతుంబళం ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరు మండలం కోటెకల్లు గ్రామానికి చెందిన కామాక్షమ్మ, అయ్యప్ప దంపతుల కూతురు శాంతమ్మ (20)ను ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన గోవిందరాజులుకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఏడాదిన్నర బాలుడు మహేంద్ర సంతానం కాగా శాంతమ్మ నాలుగు నెలల గర్భిణి. మంగళవారం రాత్రి యథావిధిగా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
ఉన్నట్టుండి మధ్యరాత్రి అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా తన భార్య శాంతమ్మ కొక్కికి ఉరేసుకుని మృతిచెందిందని భర్త గోవిందురాజులు, అతని సోదరుడు, వదిన బోరున విలపించారు. పెద్దతుంబళం పోలీసులు ఘటానా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రాత్రికి రాత్రే తల్లిదండ్రులతోపాటు బంధువులతో పాటు దాదాపు 200మంది కోటేకళ్లు గ్రామస్తులు జాలిమంచికి చేరుకున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నాటకమాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరివేసుకున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని బంధువులు సైతం అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మృతురాలి భర్త గోవిందరాజులు పరారయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు భర్త గోవిందరాజు, అతని సోదరుడు శ్రీనివాసులు, వదిన సావిత్రమ్మపై అదనపు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసులో మార్పులు చేసే అవకాశం ఉందని ఎస్‌ఐ తెలిపారు.
అయ్యో పాపం పసివాడు..
తల్లి శాంతమ్మ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం, తండ్రి గోవిందరాజులు హత్యారోపణలు ఎదుర్కొంటుండటంతో వారి ఏడాదిన్నర బాలుడు మహేంద్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తల్లి అలా ఎందుకు పడుకుందో తెలియని చిన్నారి బుడిబడి నడకలతో అటూఇటూ తిరుగుతండటం చూసి పలువురు కంట తడిపెట్టారు. అయ్యో పాపం పసివాడికి తల్లిదండ్రుల ప్రేమ దూరమైందని అక్కడికి వచ్చిన వారంతా చర్చించుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment