సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మంజు సుధా ఆస్పత్రిలో ఓ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఎనిమిది నెలల నిండు గర్భిణి మృతి చెందింది. వివరాలు.. హయత్ నగర్‌కు చెందిన గర్భిణి వసంత కడుపు నొప్పితో బాధపడుతూ వారం రోజుల క్రితం మంజు సుధా ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ రాంగోపాల్ ఏం ఫరవాలేదు.. అంతా బాగానే ఉందని చెప్పాడు. అప్పటికే కడుపులో ఉన్న శిశువు మృతి చెంది మూడు రోజులైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ గుర్తించకపోవడంతో వసంత ప్రాణాలు విడిచింది.
ఇది గమనించిన రాంగోపాల్.. పేషంట్ కండిషన్ క్రిటికల్‌గా ఉందనీ, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడని బంధువులు తెలిపారు. కాగా, ఆస్పత్రి నుంచి జారుకున్న డాక్టర్ స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. రాంగోపాల్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయనీ, ఓ రోగికి హెచ్‌ఐవీ ఇంజక్షన్ చేసిన నేరంలో ఆయన నిందితుడిగా ఉన్నాడని తెలిసింది. ఇదిలాఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లీ, బిడ్డ ఉసురు తీసిన డాక్టర్‌ను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వసంత బంధువులు హాస్పిటల్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment