అన్నానగర్: వడపళనిలో చేతులు, కాళ్లు కట్టేసి పూజారి భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో కీలక మలుపు తిరిగింది. భర్తే స్నేహితుడితో కలిసి హత్య చేసి నాటకం ఆడినట్లు తెలిసింది. దీంతో ఆలయ పూజారి సహా ఇద్దరిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. చెన్నై వడపళని దక్షిణ శివుడి ఆలయ వీధికి చెందిన బాలగణేష్ (27). ఇతను వడపళని శివుడి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య జ్ఞానప్రియ(24) 5వ తేదీ ఉదయం చేతులు, కాళ్లు కట్టిన స్థితిలో మృతిచెంది ఉంది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వచ్చి గాయాలతో ఉన్న బాలగణేష్‌ని చికిత్స కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఉత్తర్వుల ప్రకారం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు.
విచారణలో మలుపు..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలగణేష్‌ను పోలీసులు విచారణ చేశారు. ఇందులో బాలగణేష్ తన స్నేహితుడు ధనశేఖర్‌తో కలిసి జ్ఞానప్రియాని హత్య చేసినట్లు తెలిసింది. అనంతరం పోలీసులు బాలగణేష్, ధనశేఖర్‌ని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఐదేళ్ల కిందట బాలగణేష్ జ్ఞానప్రియని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం కలుగలేదు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బాలగణేష్‌కి లోపం ఉందని తెలియడంతో జ్ఞానప్రియ అతన్ని అవహేళన చేసేదని తెలిసింది. బాలగణేష్ పోరూర్‌కు చెందిన తన స్నేహితుడు ధనశేఖర్‌కు ఈ విషయం చెప్పాడు. తరువాత ఇద్దరూ పథకం వేసి బుధవారం అర్ధరాత్రి ధనశేఖర్‌తో కలిసి భార్య జ్ఞానప్రియని సుత్తితో కొట్టి హత్య చేశారు. అనంతరం ధనశేఖర్ ఇద్దరి చేతులను, కాళ్లను కట్టేసి నగలను తీసుకొనిపోయాడు. తనపై దాడి చేసి మరుగుదొడ్డిలో పాడేసినట్లు బాలగణేష్ నాటకం ఆడినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment