ఆలయ పూజారి భార్య దారుణ హత్య | Priest Wife Murder In House | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Published Fri, Apr 6 2018 11:01 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

Priest Wife Murder In House - Sakshi

జ్ఞానప్రియ, బాలగణేష్ (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై వడపళనిలో గురువారం తెల్లవారుజామున ఒక వివాహిత దారుణహత్యకు గురైంది. తీవ్రరక్తగాయాలైన ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు. కాంచీపురం నగరానికి చెందిన బాలగణేష్‌ (27) ఐదేళ్ల క్రితం జ్ఞానప్రియ (24) అనే యువతిని ప్రేమించి పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం చెన్నై వడపళనిలోని శివాలయంలో తాత్కాలిక పూజారిగా పనిలో చేరాడు. అక్కడి సమీపంలోని ఒక అద్దె ఇంటిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. పెళ్లయి ఐదేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే కానుకలతోనే కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. బుధవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన బాలగణేష్‌ భార్యతో కలిసి భోంచేసి నిద్రపోయాడు. అద్దె ఇంటి యజమాని విజయలక్ష్మి గురువారం ఉదయం 6 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్‌ వెళ్లగా అక్కడ అర్ధనగ్నంగా కాళ్లు, చేతులూ కట్టిపడేసి గాయాలైన స్థితిలో బాలగణేష్‌ పడి ఉన్నాడు.

ఈ సమాచారాన్ని అతని భార్యకు చెబుతామనే ఉద్దేశంతో ఇంటిలోకి ఆమె తొంగిచూడగా పడుకగదిలో రక్తపుమడుగులో కాళ్లూ చేతులు కట్టివేసిన స్థితిలో జ్ఞానప్రియ పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌తో అక్కడి చేరుకుని వైద్యపరీక్షలు నిర్వహించగా జ్ఞానప్రియ అప్పటికే చనిపోయినట్లు తేలడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం పంపారు. తీవ్రగాయాలైన స్థితిలో ఉన్న బాలగణేష్‌ను చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దంపతుల ఇంటి బీరువాలోని బంగారునగలు, జ్ఞానప్రియ మెడలోని ఐదుసవర్ల తాళిబొట్టు కనిపించలేదు. దుండగులను గుర్తించేందుకు పోలీస్‌ జాగిలంతోపాటు వేలిముద్రల సేకరణ కోసం ఫోరెన్సిక్‌ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంటిలోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement