
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డిని ప్రాణాలతో కాపాడలేకపోయినందుకు బాధపడుతున్నామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఆమె డయల్ 100కి కాల్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ కేసును సుమోటోగా స్వీకరించి నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. మరోవైపు... పోలీసుల అలసత్వం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయాలపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇది బాధాకర ఘటన అన్నారు. ప్రియాంక మర్డర్ కేసును ఛేదించేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ‘ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందలేదు. అయితే సమాచారం అందిన వెనువెంటనే టోల్ ప్లాజా వెరిఫై చేశాం. ప్రియాంక మృతదేహం కాలిపోవడంతో కొన్ని ఆధారాలు మిస్సయ్యాయి. అయినప్పటికీ చాలా కష్టపడి క్లూస్ సంపాదిస్తున్నాం. కీలక ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. కేసులో పురోగతి సాధించాం. ఈ క్రమంలో కాస్త ఆలస్యం జరిగింది’ అని తెలిపారు. మహిళలు, వృద్ధులు ఎవరైనా సరే తాము సమస్యలో ఉన్నామని భావిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలని విఙ్ఞప్తి చేశారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment