సాక్షి, మిర్యాలగూడ: తెలంగాణలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. పెరుమాళ్ల ప్రణయ్‌ను హత్యకు సూత్రధారిగా భావిస్తున్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్ హైదరాబాద్ వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే నల్లగొండ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సివుంది. ప్రణయ్‌ను హత్యకు అరగంట ముందు వీరు మిర్యాలగూడ వదిలివెళ్లిపోయారు. (ప్రాథమిక కథనం: హైదరాబాద్ వైపుగా నిందితుడు!)
మరోవైపు ప్రణయ్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హంతకుడు గత నెల 22న కూడా ప్రణయ్ కారును ఫాలో అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగుడు బైకుపై ప్రణయ్ కారును అనుసరించినట్టు స్పష్టంగా కనబడింది. ఇతడే జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు..
చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ప్రణయ్, అమృత ఏడాది క్రితమే పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అమృతకు మైనార్టీ తీరకపోవడంతో వీరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం అమృతకు మైనార్టీ తీరడంతో హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. కొంత కాలం అక్కడే ఉండి తర్వాత మిర్యాలగూడకు వచ్చారు. కాగా పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలసి తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాదు ప్రణయ్‌ను చంపేస్తానని పెద్ద మనుషులందరీ ముందు మారుతీరావు బెదిరించాడు. ఈ నేపథ్యంలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. కిరాయి హంతకుడితో అతడే ఈ హత్య చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆస్పత్రిలో అమృత
ఐదో నెల గర్భంతో ఉన్న అమృత ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని డాక్టర్ జ్యోతి తెలిపారు. తన ఆస్పత్రి ముందే ప్రణయ్ హత్యకు గురయ్యాడని, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. భర్త చనిపోయిన విషయాన్ని అమృతకు చెప్పానని, ఆమెకు రక్తపోటు ఎక్కువగా ఉందని తెలిపారు. పాలీహౌస్, డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నట్టు ప్రణయ్ తనతో చెప్పాడని, విదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు వెల్లడించాడన్నారు.
రేపు అంత్యక్రియలు
ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశముంది. అతడి సోదరుడు విదేశాల నుంచి రావాల్సివుంది. మరోవైపు ప్రణయ్ ఇంటికి దళిత సంఘాల నాయకులు, రాజకీయలు నేతలు పోటెత్తారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, తదితరులు శనివారం ప్రణయ్ ఇంటికి వచ్చి అతడి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రణయ్ హత్యకు నిరసరగా మిర్యాలగూడలో దళిత సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment