కేసు పూర్వాపరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ హరినాథ్‌రెడ్డి
నెల్లూరు(క్రైమ్): ఓ బాలిక(మైనర్) ఆర్థిక ఇబ్బందులతో ఉందని గ్రహించిన ఓ ముఠా నగదును ఆశగా చూపి ఆమెను వ్యభిచార రొంపిలోకి దించారు. సుమారు ఆరు నెలలుగా బాలికను విటుల వద్దకు పంపుతూ సొమ్ముచేసుకోవడంతోపాటు ఆమెను ఇబ్బందులకు గురిచేయసాగారు. దీంతో బాధిత బాలిక ముఠా కళ్లుగప్పి పరారై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మూలాపేటలోని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి కుటుంబాన్ని వదిలి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోసాగింది. పూట గడవడం కష్టంగా మారింది. దీంతో సదరు బాలిక సుమారు ఆరు నెలల క్రితం విజయవాడలోని తన పిన్ని ఇంటికి వచ్చి ఉండసాగింది. అక్కడ రామకృష్ణ అలియాస్ కృష్ణ అతని భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆమె తన ఆర్థిక పరిస్థితిని వివరించి పని చూపించమని వారిని కోరింది.
అయితే వారు తాము చెప్పినట్లు వింటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మించి బాలికను వ్యభిచార కూపంలోకి దించారు. విజయవాడలో కొంతకాలం ఉంచి అనంతరం లాక్‌డౌన్ ముందుగా బాలికను నెల్లూరులోని హరనాథపురంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ వద్ద ఉంచారు. కృష్ణ దంపతులు, మహిళ, ఆమె తమ్ముడు పృథ్వీరాజ్, మరిది వినయ్‌కుమార్ తమకు తెలిసిన వారి వద్దకు బాలికను పంపి సొమ్ము చేసుకోసాగారు. బాలికకు డబ్బులు కూడా ఇచ్చే వారు కాదు. బాలిక తన తల్లి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకోసాగారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీన బాలికను నిర్వాహకులు కారులో ఎక్కించుకుని మైపాడు వద్ద వదిలిపెట్టారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కె.శ్రీనాథ్ (తలారి) ఆమెను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. శ్రీనాథ్ అర్ధరాత్రి అయిన తర్వాత తిరిగి ఆమెను నిర్వాహకుల వద్ద వదిలివెళ్లాడు.
వారు కారులో ఎక్కించుకుని నెల్లూరుకు బయలుదేరారు. ఇందుకూరుపేట మండల పరిధిలోని మొత్తలు వద్ద వారు కారు ఆపి మూత్రవిసర్జనకు వెళ్లగా బాలిక తప్పించుకుంది. ఈ మేరకు బాధిత బాలిక ఈ నెల 30వ తేదీ ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జరిగిన విషయాన్ని ఎస్పీ భాస్కర్‌భూషణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనల మేరకు కేసు నమోదు చేశారు. రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి నేతృత్వంలో నెల్లూరు రూరల్ సీఐ కె.రామకృష్ణ, ఇందుకూరుపేట ఎస్‌ఐ పి.నరేష్, మహిళా ఎస్‌ఐ ఆదిలక్ష్మి, సిబ్బంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితులు రామకృష్ణ, అతని భార్య పరారు కాగా మిగిలిన వారు 31వ తేదీ సాయంత్రం కొరుటూరు వద్ద ఉండగా వారిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సూత్రదారుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. కేసును త్వరితగతిన చేధించిన సీఐ కె.రామకృష్ణ, ఇందుకూరుపేట ఎస్‌ఐ పి.నరేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
పూర్తిస్థాయి విచారణ
ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని విలేకరులు డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు అధికారి పాత్రపై ఆరోపణలు వచ్చిన మాట మాత్రం వాస్తవమేనని, అయితే ప్రాథమిక విచారణలో అతని ప్రమేయం లేదని డీఎస్పీ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment