‘సేఫ్‌’ సర్టిఫికెట్‌ | Sakshi
Sakshi News home page

‘సేఫ్‌’ సర్టిఫికెట్‌

Published Fri, Jun 28 2019 2:25 PM

Rachakonda Police Gives Appreciate Stickers To People For Safe Driving - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్‌ ధరించలేదని వాహనదారుడికి జరిమానా, సీటు బెల్ట్‌ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు ఫైన్, సిగ్నల్‌ జంపింగ్‌ చేశాడని మరో వాహనదారుడికి ఈ–చలాన్‌...ఇలా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనులను శిక్షించినట్లుగానే...ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులనూ గుర్తించి ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ సేఫ్‌ డ్రైవింగ్‌’ పేరుతో స్టిక్కర్‌ ఇచ్చి ప్రశంసిస్తున్నారు. అబుదాబీలో అమలులో ఉన్న ఈ విధానాన్ని ‘పట్రోల్‌ ఫర్‌ హ్యపీ డ్రైవింగ్‌’ పేరుతో దేశంలోనే తొలిసారిగా గురువారం చింతల్‌కుంట ఎక్స్‌రోడ్డులో సీపీ మహేష్‌ భగవత్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోడ్డుపై వస్తున్న కొన్ని వాహనాలను తనిఖీ చేసిన సీపీ ఈ–చలాన్‌లో జరిమానాలు లేని కారు డ్రైవింగ్‌ చేస్తున్న లేడీ డాక్టర్‌ రిచా, సీనియర్‌ సిటిజన్‌ గోపాల కే సురేఖతో పాటు మరికొందరి వాహనాలకు ‘సేఫ్‌ డ్రైవర్‌ స్టిక్కర్స్‌’ను అతికించారు. అనంతరం వారిని సర్టిఫికెట్‌తో సన్మానించారు. చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తూ ఎదుటివారికి ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్‌ చేస్తున్న వారిని ప్రోత్సహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.

ఈ ఆరు నెలల్లో మరో నాలుగువేల వాహనాలు, వచ్చే ఏడాది ఎనిమిది వేల వాహనచోదకులను గుర్తించి సర్టిఫికెట్లతో సత్కరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రోజుకు 24 వాహనాల చొప్పున ఆరు నెలల్లో  నాలుగువేల మంది వాహనచోదకులను గుర్తించి ‘పట్రోల్‌ ఫర్‌ హ్యపీ డ్రైవింగ్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.

అబుదాబీలో 2016 అక్టోబర్‌ నుంచి ఈ విధానం అమలు చేస్తుండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ట్రాఫిక్‌ నియమాలు పాటించే అలవాటు పెరిగిందన్నారు. ఆ తరహా మార్పు త్వరలో రాచకొండ పరిధిలోని వాహనదారుల్లో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

రోజూ సేఫ్‌ డ్రైవర్ల గుర్తింపు... 
ట్రాఫిక్‌ ఉల్లంఘనలను పట్టుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తున్న మర్యాద వాహనచోదకులను కూడా గుర్తించనున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్, భువనగిరి జోన్లలో ప్రతిరోజూ కొన్ని వాహనాలను గుర్తించి సేఫ్‌ డ్రైవర్‌ స్టిక్కర్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను అందించనున్నారు.

తద్వారా వారు ట్రాఫిక్‌ నియమాలను పాటించడంతో పాటు ఇతరులను చైతన్యం చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన వాహనచోదకుడు ఆరు నెలల పాటు మళ్లీ ట్రాఫిక్‌ నియమాలు తూచతప్పకుండా పాటిస్తే రివార్డుతో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జోన్ల ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement