రైల్లో అసభ్యంగా ప్రవర్తించిన అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ సతీష్‌ను అరెస్ట్ చేసిన ఆర్‌పీఎఫ్ పోలీసులు
రాజమహేంద్రవరం సిటీ: రైలులో ప్రయాణిస్తున్న తోటి మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించి, టిక్కెట్ కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించాడనే ఫిర్యాదుతో అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్‌ను బుధవారం రాజమహేంద్రవరం ఆర్‌పీఎఫ్ పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అసభ్య ప్రవర్తన నేరం ఆర్‌పీఎఫ్ పరిధిలో కేసు నమోదుకు అవకాశం లేకపోవడంతో రెండో కేసుగా జీఆర్‌పీకి అప్పగించారు. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి మచిలీపట్నం–విశాఖపట్నం ప్యాసింజర్ రైల్లో ఎస్–1 బోగీలో ప్రయాణిస్తున్న చోడిశెట్టి అనూషపై అదే రైల్లో ప్రయాణిస్తున్న రైల్వే అసిస్టెంట్ టెక్నికల్ అధికారి సతీష్ అసభ్యంగా ప్రవర్తించడంతో రైల్వే టిక్కెట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని, ఆ విషయం అడిగేందుకు వచ్చిన టీసీపై సైతం తిరగబడటంతో తోటి ప్రయాణికుల సహాయంతో 182కు ఫిర్యాదు చేశారన్నారు.
రైలు రాజమహేంద్రవరం చేరే సమయానికి ప్లాట్‌ఫామ్ పైకి చేరుకున్న ఆర్‌పీఎఫ్ పోలీసులు అప్రమత్తమై సతీష్‌ను అదుపులోనికి తీసుకున్నామన్నారు. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న నేరానికి, టీసీపై ఎదురుదాడికి దిగిన నేరానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రామయ్య తెలిపారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేరం ఆర్‌పీఎఫ్ పరిధిలో లేక పోవడంతో ఆ నేరాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు జీఆర్‌పీ డీఎస్‌పీ ఎస్ మనోహరరావును వివరణ కోరగా సంఘటన జరిగిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం లోనిదని, ముద్దాయిని అదుపులోనికి తీసుకుని భీమవరం తరలించినట్లు తెలిపారు. భీమవరం పోలీసులు కేసునమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment