
ఆభరణాలను అప్పగిస్తూ ప్రయాణికుడి నుంచి వివరాలు తెలుసుకుంటున్న రైల్వే పోలీసులు
ప్రకాశం, చీరాల అర్బన్: కొద్ది సేపట్లో గమ్యం చేరుకోబోతున్న ప్రయాణికుడి బ్యాగు ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడిపోయింది. అందులో సుమారు 70 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే బ్యాగును గుర్తించి బాధితుడికి అప్పగించారు. ఈ సంఘటన చీరాలలో బుధవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కారంచేడుకు చెందిన యార్లగడ్డ సురేష్‌కుమార్ నెల్లూరులోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళాడు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్నాడు. చీరాల సమీపిస్తుండటంతో వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో తన సామగ్రిని సర్దుకుంటున్నాడు.
వాటిలో ఓ బ్యాగుకు చక్రాలు ఉండటంతో అది దొర్లుకుంటూ డోరు వద్దకు వెళ్లి కింద పడిపోయింది. ఆయన గమనించలేదు. కొద్దిసేపటికి బ్యాగు కనిపించకపోవడంతో చీరాల స్టేషన్‌లో దిగిన వెంటనే జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో 70 సవర్ల బంగారం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అవ్వారు శ్రీనివాసరావు, మరో ఆరుగురు సిబ్బంది టార్చిలైట్‌ల సాయంతో రైల్వే ట్రాక్ వెంబడి వెళ్లారు. వేటపాలెం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ట్రాక్ పక్కన పడి ఉన్న బ్యాగ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి సమక్షంలో బ్యాగును తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకుని బాధితుడికి బ్యాగ్ అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment