ఈ చిత్రంలో కనిపిస్తున్న ఎర్రచందనం దుంగలను అక్రమార్కులు తరలిస్తుండగా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. పెనుకొండ , సోమందేపల్లి పోలీసులు ఏకకాలంలో దాడులకు దిగడంతో దిక్కు తెలియని స్మగ్లర్లు వాహనాలను సోమందేపల్లి పట్టణంలో పార్కింగ్‌లో కార్ల ఉంచినట్లు పోలీసులను నమ్మించి తప్పించుకునే యత్నం చేశారు. అయితే పోలీసుల అప్రమత్తతతో ఎర్రచందనం రవాణా గుట్టురట్టైంది. ఇలాగే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు మస్కాకొట్టి స్మగ్లర్లు దుంగలను దర్జాగా రాష్ట్రం దాటించేస్తున్నారు.
పెనుకొండ: ఎర్ర చందనం అక్రమ రవాణాకు 44వ జాతీయ రహదారి అడ్డాగా మారింది. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా... అటవీశాఖ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా ఎర్రచందనం అడ్డదారుల్లో ఇష్టారాజ్యంగా తరలుతోందన్న విమర్శలున్నాయి. చుట్టపుచూపుగా కొందరు అటవీ సిబ్బంది విధులకు వస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. గతంలో ఏకంగా అటవీశాఖ కార్యాలయంలోనే నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను రాత్రికి రాత్రే అపహరించుకు వెళ్ళినా అధికారులు ఏమీ చేయలేకపోయారు.
విపరీతమైన డిమాండ్
మార్కెట్లో ఎర్రచందనానికి విపరీతమైన గిరాకీ ఉండటం వల్లే స్మగ్లర్లు, వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఎర్రచందనంతో మందుల తయారీ, బొమ్మల తయారీ, ఆయుర్వేదిక్ ఔషధాల తయారీలో అధికంగా ఉపయోగిస్తారు. మనదేశంతో పాటు విదేశాల్లో సైతం అధిక డిమాండ్ వుంది. ప్రభుత్వ ధరల ప్రకారమే ఏ గ్రేడ్ కిలో ఎర్రచందనం రూ.2,750 , బీ గ్రేడ్ రూ.1650 నిర్ణయించారు. అయితే బహిరంగ మార్కెట్లో కిలో దాదాపుగా ఏ గ్రేడ్ ఎర్రచందనం రూ. 4000 పైనే పలుకుతోందని తెలుస్తోంది. దీంతో తమ పథకం పారితే ఒకే రోజులో కోటీశ్వరులు కావచ్చన్న అత్యాశతో వ్యాపారులు ఈ అక్రమ రవాణాను ముమ్మరం చేశారు.
తమిళులతో వ్యాపారుల సంబంధాలు
మన రాష్ట్రంలోని పలువురు ఎర్రచందనం వ్యాపారులు తమిళ స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని బెంగళూరు కేంద్రంగా దుంగలను తరలిస్తున్నట్లు సమాచారం. కడప జిల్లాలోని అటవీప్రాంతంలో ప్రాంతంలో చెట్లను నరకి జాతీయ రహదారి మీదుగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కొందరు అధికారులే చెబుతున్నారు.
పెనుకొండ పరిధిలో మచ్చుకుకొని కేసులు..
♦ అక్టోబర్ 5, 2011లో 343 దుంగలతో పాటు లారీ, స్కార్పియోను సీజ్ చేసి 19 మందిని అరెస్టు చేశారు.
♦ 2011 నవంబర్ 19న హరిపురం వద్ద 173 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసు నమోదు చేసి కారు, టాటా సుమో, ఈచర్‌ను సీజ్ చేశారు.
♦ 2014 ఫిబ్రవరి 28న 32 దుంగలను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. ఈచర్ వ్యాన్‌ను సీజ్ చేశారు.
♦ 2015 ఆగస్టు 15న దుద్దేబండ క్రాస్ వద్ద 40 దుంగలను పట్టుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లను రేంజ్‌కార్యాలయానికి తరలించారు.
♦ అక్టోబర్ 18, 2017లో 18 దుంగలను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు.
♦ ఈనెల 2న సోమందేపల్లి పోలీసులు 2 ఎక్స్‌యూవీ ఖరీదైన కార్లలో తరలిస్తున్న 43 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
♦ అటవీశాఖ, గోరంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. కోట్ల రూపాయల విలువజేసే ఎర్రచందనం రాష్ట్రం దాటుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్రలోనే ఉన్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
సిబ్బంది కొరత ఉంది
అటవీ శాఖ సిబ్బంది కొరత ఉంది. తగిన వాహనాలు కాని, ఇతరత్రా సౌకర్యాలు లేవు. సమస్య తీవ్రత ఉన్నతాధికారులకు కూడా తెలుసు. ఇటీవల బాధ్యతలు తీసుకున్నా. ఎన్ని కేçసులు ఉన్న విషయం కూడా తెలీదు. ఎర్రచందనం రవాణాకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటాం.– రవిశేఖర్, రేంజర్, పెనుకొండ
Comments
Please login to add a commentAdd a comment