పోలీస్‌ వేషంలో దర్జాగా | Redwood Smuggling Gang Arrest In PSR Nellore | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వేషంలో దర్జాగా

Published Fri, Jun 1 2018 11:44 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

Redwood Smuggling Gang Arrest In PSR Nellore - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): పోలీసు దుస్తుల్లో అధునాతన ఆయుధాలను ధరించి ఎర్రచందనాన్ని అనంతపురం మీదుగా  బెంగళూరు సరిహద్దులు దాటించడంలో వారు అందెవేసిన చేయి. కప్పం చెల్లిస్తేనే ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించడం, లేదంటే హైజాకింగ్‌ చేయడం వారి నైజం. ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టేందుకు సైతం వెనుకాడని ఆరుగురు సభ్యులు గల కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ఎర్రస్మగ్లర్ల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే ఎర్రదుంగలు, వాహనాలు, అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫెరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ గ్యాంగ్‌ వివరాలను వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా హోస్‌కోట తాలుకా శివపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడైన శివపురం మునియప్ప వెంకటరాజు తన సోదరుడు శివపురం మునియప్పరవి, రామప్ప మంజునాథ, రామప్ప రాజేంద్ర, శివపురం రవినవీన్‌లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా సంబేరి గ్రామానికి చెందిన రాజేంద్ర బాలాజితో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పూనుకున్నారు.

గత కొంతకాలంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో పోలీసు దాడులు అధికమైన నేపథ్యంలో అక్రమ రవాణా కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ మూడు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల వివరాలు సేకరించి వారిని సంప్రదించేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో  ఎర్రదుంగలను అనంతపురం, హోస్‌కోట మీదుగా బెంగళూరు సరిహద్దులు దాటిస్తామని, అందుకు గాను టన్నుకు రూ.1.50 లక్షలు కప్పం చెల్లించాలని స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకొనేవారు. బెంగళూరుకు వెళ్లాలంటే హోస్‌కోట ప్రధాన మార్గం కావడంతో స్మగ్లర్లు ముఠా చెప్పిన కప్పం చెల్లించేవారు. దీంతో ముఠా సభ్యులు పోలీసుల లాగా దుస్తులు ధరించి ఆధునాతన ఆయుధాల(తుపాకులు)ను చేతబూని ఎర్రచందనం సరిహద్దులు దాటిస్తారు. కప్పం చెల్లించని వారి వాహనాలను ముఠా సభ్యులే హైజాక్‌ చేసి వాటిని చెన్నైకు తరలించి అమ్మి సొమ్ము చేసుకోసాగారు.

రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఇటీవల మరో ముఠా ఇదే తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతుండడంతో ఇరు ముఠాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని కాల్పులు సైతం చేసుకున్న క్రమంలో అక్రమ రవాణా, హైజాక్‌ వ్యవహారం బయటపడింది. ముఠాలో సభ్యుడైన బాలాజి గత కొద్దినెలలుగా తడ మీదుగా చెన్నైకు ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. ఈవిషయంపై జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు క్రైం ఓఎస్‌డీ టీపీ విఠలేశ్వర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, వెంకటాచలం, పొదలకూరు, కావలి రూరల్‌ పోలీసులు నిందితులపై నిఘా ఉంచారు.

నిందితుల అరెస్ట్‌
బుధవారం రాత్రి నిందితులు నెల్లూరు నుంచి ఎర్రదుంగలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వెంకటాచల సత్రం సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ముఠా నాయకుడు శివపురం మునియప్ప వెంకటరాజు, రామప్ప మంజునాథ్, శివపురం రవినవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి టయోటా ఫార్చునర్‌ కారు, ఎస్‌బీఎంఎల్‌ గన్, ఫెనివేర్‌కబు ఎయిర్‌గన్, ఎఫ్‌ఎక్స్‌రాయల్‌ ఎయిర్‌గన్, 10 ఎర్రదుంగలు, 770 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.52,500 నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో పొదలకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డేగపూడి వద్ద రాజేంద్రన్‌బాలాజీని అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి లారీ, 177 కోల్‌ ఎయిర్‌ఫిస్టల్, 11 కేజీల ఎర్రదుంగలు, రూ.2.500 నగదు, వివో సెల్‌ఫోన్, కావలి ముసునూరు ఫ్‌లైఓవర్‌ వద్ద శివపురం మునియప్ప రవి, రామప్ప గజేంద్రలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి మహేంద్ర బొలేరో వాహనం, 14 ఎర్రదుంగలు, 30 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2000 నగదు, నోకియా, ఎంఐ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వీరందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించే క్రమంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు అతికష్టంపై వారిని అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్న 35 ఎర్రదుంగలు, మూడు వాహనాలు, 8 సెల్‌ఫోన్లు, 770 గ్రాముల బంగారం విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితులను విచారించగా ఇదే తరహా నేరానికి పాల్పడుతున్న ముఠా వివరాలను వెల్లడించారని, వారి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని తెలిపారు. వీరితోపాటు వింజమూరు పోలీస్‌స్టేషన్‌లో రెండున్నరేళ్ల క్రితం నమోదైన కేసుల్లో వైఎస్‌ఆర్‌ కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కె.సుబ్రమణ్యం అలియాస్‌ మణి, ఓబులవారిపల్లికి చెందిన కె.కోటేశ్వరరావు అలియాస్‌ కోటిలను సైతం అరెస్ట్‌ చేశారు. వీరిపై 20కు పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.

దివ్యాంగుడైనా ముఠాను నడపడంలో దిట్ట  
ముఠానాయకుడు శివపురం మునియప్ప వెంకటరాజు దివ్యాంగుడు. రెండు కాళ్లు పనిచేయవు. వీల్‌చైర్‌లో ఉంటూనే కారు నడపడంలో నేర్పరి. 200 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ ఎన్నోసార్లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. తన సోదరుడు రవితో కలిసి ముఠా>ను ఏర్పాటు చేసి ఎర్రస్మగ్లింగ్, హైజాక్‌లకు పాల్పడుతూ రూ.కోట్లు ఆర్జించాడు. దివ్యాండైన మునియప్ప ఈ తరహా నేరాలకు పాల్పడుతాడన్న విషయం విస్మయానికి గురిచేస్తోందని ఎస్పీ అన్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి పెద్ద ఎత్తున ఎర్రదుంగలు, వాహనాలు, అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకొన్న టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజావలి, పొదలకూరు, వెంకటాచలం, కావలి రూరల్‌ ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ బి.శరత్‌బాబు, క్రైం ఓఎస్‌డీ టి.పి.విఠలేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ముఠా నాయకుడు ఎస్‌ఎం వెంకటరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement