శ్రీనివాసులు అలియాస్ నాయుడు
కడప అర్బన్ : తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన ఎత్తిరాజులు శ్రీనివాసులు అలియాస్ నాయుడు బీఎస్సీ (కెమిస్ట్రీ), బీసీఏ వరకు చదివి సత్యం కంప్యూటర్స్‌లో టెలికాం ఇంజనీర్‌గా పని చేశాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎనిమిదేళ్ల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారిగా మారాడు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ సుమారు 600 టన్నుల మేరకు ఎర్రచందనం దుంగలను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించాడు. ఇతనిపై జిల్లాలో 25 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని యథేచ్ఛగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హర్యాన, గుజరాత్, రాజస్థాన్, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ∙ఇటీవల కాలంలో రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబుళవారిపల్లె ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేసిన ఎర్రచందనం స్మగ్లర్ల విచారణలో ఎత్తిరాజులు శ్రీనివాసులు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ∙శ్రీనివాసులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్మగ్లర్లతో సంబంధాలను ఏర్పరచుకుని చెట్లు నరికేవారిని రాయలసీమ జిల్లాలలోని శేషాచలం, లంకమల్ల, నల్లమల అటవీ ప్రాంతాల్లోకి పంపించి వారి ద్వారా ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడేవాడు. ∙పోలీసులకు పట్టుబడటం ఇదే మొదటి సారి. ఎనిమిదేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగాడు.
ఇతను దుబాయ్‌లో ఉంటున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు సాహుల్‌భాయ్, మన్సూర్, బిలాల్‌లకు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ∙గ్రానైట్ రాళ్లు, సిరామిక్ టైల్స్, ఆహార ధాన్యాలు, కొబ్బరిపీచు, ఇటుకలు, కూరగాయలు తదితర వాటి ఎగుమతి మాటున ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసి గమ్యస్థానాలకు చేర్చేవాడు. ∙జిల్లాలోని అటవీ ప్రాంతంల నుండి ఎర్రచందనం దుంగలను లారీలు, కంటైనర్లు, ఐచర్ వాహనాలు, విలువైన కార్లలో ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసి, అంతర్జాతీయ స్మగ్లర్లకు విక్రయిస్తూ ఉన్నాడు. ∙జిల్లాలోని రైల్వేకోడూరు మండలం ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన తేనేపల్లి లక్షుమయ్య, గొంటు వినోద్ కుమార్‌లు శ్రీనివాసులుకు ప్రధాన అనుచరులుగా మారారు.తేనెపల్లి లక్షుమయ్యపై జిల్లాలో 9 కేసులు, గొంటు వినోద్ కుమార్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.
నిందితులు పట్టుబడిన వైనం : ఇటీవల సేతు మాధవన్, షేక్ ముబారక్ అలి, ఆర్కాట్‌భాయ్, సత్యనారాయణ, గిరినాయుడులను రైల్వేకోడూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఎత్తిరాజులు శ్రీనివాసులు అలియస్ నాయుడు ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు వ్యూహాత్మకంగా జిల్లా పోలీసు ప్రత్యేక బృందం అతని కదలికలపై నిఘా ఉంచి ఈనెల 24 రాత్రి తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలో వలపన్ని ఎత్తిరాజులు శ్రీనివాసులు అలియాస్ నాయుడును అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వాగేటికోన చెరువు అలుగు సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న అతని అనుచరులు తేనేపల్లి లక్షుమయ్య, గొంటు వినోద్ కుమార్‌లను సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 593 కిలోల బరువున్న 22 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్‌లు, 59.4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.13,470 నగదులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలను జిల్లా ఎస్పీ సోమవారం సాయంత్రం కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సిబ్బందిని అభినందించిన ఎస్పీ :ఈ సంఘటనలో నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం ఆస్మి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి. శ్రీనివాసులు, రాజంపేట డీఎస్పీ బి. లక్ష్మినారాయణ, సీఐ పద్మనాభన్, ఎస్‌ఐలు కొండారెడ్డి, ఎం. భక్తవత్సలం, కానిస్టేబుళ్లు ఎస్. శివరాం నాయు డు, జి. వెంకటరమణ, సి. కొండయ్య, బి. గోపినాయక్, బి. సురేష్, కిరణ్ కుమార్, పి. రాకేష్‌లను ఎస్పీ బాబూజీ అట్టాడ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment