ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నాగర్‌కర్నూల్: అది పెళ్లయిన ఇళ్లు.. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా వెళ్లలేదు.. పచ్చని తోరణాలు తొలగించలేదు... అంతలోనే పెళ్లికొడుకు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం కోడుపర్తి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్రీనివాస్‌రెడ్డి(45) పెద్దకుమారుడు రాందేవ్‌రెడ్డికి ఈనెల 19న గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి కోడుపర్తికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులతో సహా వచ్చారు.
రాత్రి ఉక్కపోతగా ఉండటంతో భోజనాల తర్వాత బంధువుల వద్ద ఉన్న బంగారు నగలను సూట్‌కేసులో భద్రపర్చి అంతా కలసి మేడపై నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారేసరికి సూట్‌కేసులోని సుమారు 24 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాస్‌రెడ్డి తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో సహా పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. ఇది బయటి దొంగల పనికాదని, బంధువుల్లో ఎవరో దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి బంధువులందరినీ వేర్వేరుగా ప్రశ్నించడంతో పాటు నిజం తేలకుంటే అందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తామని హెచ్చరించారు.
మనస్తాపంతో...
ఇంట్లో శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరగాల్సి ఉండగా పోలీసుల విచారణతో శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులలో ఎవరిని తప్పు పట్టాలో, పోలీసులు ఎవరిని అవమానం పాలుచేస్తారో తెలియక మదనపడ్డారు. ఒకవేళ ఆభరణాలు దొరకకపోతే బంధువులకు తానే ఇవ్వాల్సి వస్తుందన్న ఆవేదనతో ఆయన శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లి పెళ్లికొడుకు రాందేవ్‌రెడ్డికి ఫోన్ చేసి అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని, గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ చెప్పి ఉరి వేసుకున్నాడు. కాగా, అంతకుముందు చోరీ అయిన బంగారు ఆభరణాలను దొంగలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రోడ్డుపై పడేసి వెళ్లారు.
కొందరు చేసిన పనికి తాము కుటుంబ పెద్దదిక్కును కోల్పోయామని శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మ, కొడుకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాందేవ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బంగారం పోయిందన్న అవమానంతోనే శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందులో పోలీసుల ఒత్తిడి ఏమీ లేదని ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment