లారీనీ ఢీకొట్టిన కావేరి ట్రావెల్స్ బస్సు , మృతుడు ఇర్షాద్‌బాషా
అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జాతీయరహదారిపై దూసుకెలుతున్న కావెరి ట్రావెల్స్ బస్సు వేగం అదుపుచేసుకోలేక ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కర్నూలుకు చెందిన ప్రయాణికుడు మృత్యువాతపడ్డాడు. మరో పది మంది గాయపడ్డారు.
రామగిరి : జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని ప్రైవేట్ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ మహమ్మద్ రఫి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి 49 మంది ప్రయాణికులతో మైసూర్‌కు బయల్దేరింది. ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు.
శనివారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్ గేటు సమీపంలోకి రాగానే ఆలుగడ్డల లోడుతో నెమ్మదిగా వెళుతున్న లారీని అతివేగంతో వస్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. వేగం తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. కళ్లు తెరిచి చూస్తే ఘోరమైన రోడ్డు ప్రమాదం. తమతోపాటు ప్రయాణిస్తున్న వారిలో కర్నూలు నగరానికి చెందిన ఇర్షాద్‌బాషా (45) సీటులోనే మృతి చెందాడు. రాజు (నూజివీడు), అజయ్‌కుమార్‌రెడ్డి (నరసరావుపేట), శ్రీనివాసులు (బెంగళూరు), పవన్‌కుమార్, రామ్‌కుమార్, నారాయణ ఉన్ని, శివకుమార్, ప్రవీణ్ (హైదరాబాద్), మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.
మిగతా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగేశారు. క్షతగాత్రులను పోలీసులు 108 వాహనంలో అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇర్షాద్‌బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. బస్సు అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment