సాక్షి, నిజామాబాద్: సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నడుస్తున్న నలుగురిని వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీ కొనడంతో ఘటన స్థలంలో ఇద్దరు మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కమ్మర్‌పల్లిలో గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌కు చెందిన పానుగంటి శ్రీజ(23), నిర్మల్ జిల్లా ఇచ్చోడకు చెందిన బాణాల లక్ష్మి ఆతిథ్య(8), బాణాల లక్ష్మి ఆదిత్య, ఆదిలాబాద్‌కు చెందిన గొంగళ్ల దేవాంశ్ తమ బంధువు స్థానిక వ్యాపారి సురంగి చంద్రశేఖర్ ఇంటికి వారం రోజుల కింద వచ్చారు.
ఇంటికి అవసరమైన సామగ్రిని తేవడానికి బయటకు వెళ్లి ఇంటికి చేరుకునే సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటు వస్తున్న నలుగురిని మెట్‌పల్లి వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఘటనా స్థలంలో పానుగంటి శ్రీజ, లక్ష్మి ఆదిత్య మరణించారు. తీవ్ర గాయాల పాలైన బాణాల లక్ష్మి అతిద్య, దేవాంశ్‌లను హుటాహుటిన పోలీసు వాహనంలో ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. దేవాంష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ నుంచి నిజామాబాద్‌కు తరలించారు. కారు నడిపిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు.
నాడు తల్లి.. నేడు కూతురు..
రోడ్డు ప్రమాదం తగతంలో తల్లిని బలి తీసుకోగా నేడు కూతురిని కబళించింది. తల్లి, కూతుళ్లు ఒకే విధంగా ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పానుగంటి శ్రీజ(23) తల్లి విజయ సంధ్య ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జూనియర్ కళాశాలో తెలుగు లెక్చరర్‌గా పని చేసేది. ఆమె కూడా 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందింది. శ్రీజ పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. ఆమె తండ్రి శేఖర్, సవతి తల్లి రోహిణి వరంగల్‌లో నివసిస్తున్నారు.
చుట్టపు చూపుగా వచ్చి..
రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీజ, ఆతిథ్య, గాయపడిన లక్ష్మి ఆదిత్య, దేవాంశ్ సెలవుల్లో గడపడం కోసం తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఇందులో శ్రీజ, ఆదిత్య అక్కా చెల్లెళ్ల కూతుర్లు. వీరి మేనమామ కొడుకే దేవాంశ్.
అతి వేగమే ప్రమాదానికి కారణం..
రోడ్డు ప్రమాదానికి కారును అతి వేగంగా నడుపడమే కారణం అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కమ్మర్‌పల్లిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో కారును స్థానికులు గుర్తించలేక పోయారు. చివరకు పోలీసులు కారును, డ్రైవర్‌ను గుర్తించారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. సదరు వ్యక్తి గతంలో కూడా అతివేగంగా కారు నడిపేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. చదవండి: రంగయ్య మృతిపై రాజకీయం.. రాష్ట్ర నాయకుల క్యూ
Comments
Please login to add a commentAdd a comment