రహదారులపై మరణ మృదంగం మోగుతోంది.. రోడ్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను ‘రోడ్డు’న పడేస్తోంది.
సాక్షి,నిజామాబాద్ : రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలవుతున్నారు. మరోవైపు, రోజూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో స్పందన కరువైంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో వారు విఫలమవుతున్నారు.
బయటకు వెళ్లాలంటేనే భయం..
నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో రోడ్డెక్కాలంటేనే భయంగా పట్టుకుంది. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చే దాకా కుటుంబ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పోయింది. 22 ప్రాంతాలను డేంజర్ జోన్లుగా గుర్తించారు. రెండు జిల్లాల మీదుగా 105 కిలోమీటర్ల జాతీయ రహదారి, 1,988 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిపై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడేళ్లలో సుమారు 9 వేల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నాలుగేళ్లలో జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లోనే 599 మంది మృతి చెందారు.
నిర్లక్ష్యం, అతివేగం..
ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యం, అతివేగమే. ర్యాష్ డ్రైవింగ్, ఫోన్/డ్రంకన్ డ్రైవింగ్ కూడా యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. జిల్లాలో నెలకు సగటున 100 నుంచి 110 వరకు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయా ప్రమాదాల్లో కనీసం 20–25 మంది మృతి చెందుతున్నారు. ముఖ్యంగా వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్లు మాట్లాడుతుండడం, నిర్లక్ష్యంగా నడపడం, ఎదురుగా వచ్చే వాహనాలను గమనించక పోవడం వంటి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా గమ్యానికి చేరుకోవాలనే తపనతో వేగంగా వెళ్తుండడం వల్ల బతుకులే చిన్నాభిన్నమవుతున్నాయి.
‘మలుపు’ తిరుగుతున్న బతుకులు
ప్రమాదాలకు నాణ్యత లేని రోడ్లు కూడా కారణమవుతున్నాయి. గుంతలు పడిన రహదారులు, ప్రమాదకర మూల మలుపులు ప్రాణాలను బలిగొంటున్నాయి. చాలా చోట్ల క్రాసింగ్‌లు సూచించే బోర్డులు కనిపించడం లేదు. ఇది గమనించకుండా అతి వేగంగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
నిబంధనలు పాటించాలి..
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు. కచ్చితంగా హెల్మెట్/సీటుబెల్టు ధరించాలి. సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్‌లకు దూరంగా ఉండాలి. ప్రమాదాలు నివారించేందుకు పోలీసు శాఖ తరఫున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– శ్రీనివాస్‌కూమార్, ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment