గుంతకల్లులో చోరీ జరిగిన గోవిందురాజులు ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు
అనంతపురం, పుట్టపర్తి అర్బన్/ గుంతకల్లు: దొంగలు బరితెగించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తెగబడ్డారు. మూడు ప్రాంతాల్లోని పది ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లోని శివయ్య, వెంకటరాముడు, అరుణ, అనసూయమ్మ, వరలక్ష్మి ఇళ్లలో దొంగలు పడ్డారు. వరలక్ష్మి ఇంటిలో రూ.20 వేల నగదు, రెండు తులాలు విలువ చేసే కమ్మలు, శివయ్య ఇంటిలో 8 బంగారు ఉంగరాలు, జత కమ్మలు, కాలిపట్టీలు ఎత్తుకుపోయారు. మిగతా మూడు ఇళ్లల్లో విలువైన దుస్తులు అపహరించుకుపోయారు. బాధితులంతా చిరుద్యోగులు. ఆదివారం సెలవు కావడంతో శనివారమే ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఈ ఇళ్లకు కన్నం వేశారు. ప్రశాంతిగ్రామంలోనూ రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఏమేమి చోరీ అయ్యాయో బాధితులు ఫిర్యాదు చేయలేదని రూరల్ ఎస్‌ఐ శాంతిలాల్ తెలిపారు.
గుంతకల్లులో మూడు ఇళ్లలో...
పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపాన రైతు గోవిందరాజులు, లక్ష్మీదేవమ్మలు ఒకే భవనంలో అద్దెకు ఉంటున్నారు. రైతు గోవిందురాజులు సంక్రాంతి పండుగ కావడంతో భార్య కృష్ణవేణి పుట్టినిల్లు అయిన డొనేకల్లుకు వెళ్లారు. గోవిందురాజులు స్వగ్రామం బెల్డోనకు వెళ్లి అక్కడే ఉన్నారు. ఇదే ఇంట్లో పై అంతస్తులో నివాసముంటున్న లక్ష్మీదేవమ్మ కూడా తన స్వగ్రామం వెళ్లింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు శనివారం అర్ధరాత్రి తొలుత రైతు గోవిందురాజులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 30 తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.80వేల పైచిలుకు నగదు అపహరించుకుపోయారు. పై అంతస్తులో నివాసముంటున్న లక్ష్మీదేవమ్మ ఇంట్లో రూ.4వేల నగదు ఎత్తుకెళ్లారు. హౌసింగ్ బోర్డులోని తాళం వేసిన షబ్బీర్ ఇంట్లో కూడా దొంగతనం చేశారు. రూ.20వేల నగదు, జత బంగారు జుంకీలు చోరీ చేశారు. ఆదివారం ఉదయాన్నే తలుపులు పగులగొట్టి ఉండటం గమనించిన ఇరుగుపొరుగు వారు బాధిత కుటుంబ యజమానులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఖాసీంసాబ్, సీఐలు అనిల్‌కుమార్, సాయిప్రసాద్‌లు సంఘటన స్థలాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఊళ్లకు వెళితే...
ఇంటికి తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారు పోలీసుస్టేషన్లలో సమాచారమివ్వాలని చెబుతున్నా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఊళ్లకు వెళ్లే ముందు పోలీసుస్టేషన్‌లో తెలిపితే ఎల్‌హెచ్‌ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) కెమెరాలు ఇంటికి అమర్చుతారు. ఈ కెమెరాలు పోలీసుస్టేషన్‌లోని మెయిన్ సీసీ కెమెరాల ఫుటేజ్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీసుస్టేషన్‌లో అలారం మోగుతుంది. పోలీసులు అప్రమత్తమై దొంగలను పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment