వైరాలో ముసుగుదొంగ  | Robbery Attempt In Wyra Andhra Bank | Sakshi
Sakshi News home page

వైరాలో ముసుగుదొంగ 

Published Fri, Oct 25 2019 11:08 AM | Last Updated on Fri, Oct 25 2019 11:08 AM

Robbery Attempt In Wyra Andhra Bank - Sakshi

వైరా ఎస్‌బీఐ బ్రాంచిపైన సీసీ పుటేజీలో లభించిన దృశ్యం

సాక్షి, వైరా(ఖమ్మం): వైరా ఆంధ్రాబ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఓ దొంగ బుధవారం అర్ధరాత్రి విఫలయత్నం చేశాడు. అలారం మోగడంతో పలాయనం చిత్తగించాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..రోజూలాగే బుధవారం కూడా వైరా పాత బస్టాండ్‌ సెంటర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ సిబ్బంది విధుల అనంతరం బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు. రాత్రి 11.33 గంటల సమయంలో బ్యాంక్‌ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పక్కనే ఉన్న మెడికల్‌ షాపు యాజమాని మిథున్‌ చక్రవర్తి 100 నంబర్‌కు ఫోన్‌ చేశాడు. శబ్దాలు ఎక్కువ కావడంతో మళ్లీ ఫోన్‌ చేశాడు. దీంతో రాత్రి 12 గంటల సమయంలో ఏసీపీ, సీఐ, ఎస్‌ఐ బ్యాంక్‌ వద్దకు చేరుకుని పరిశీలించారు. చోరీకి యత్నం జరిగినట్లు గుర్తించారు.

బ్యాంక్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారూ వచ్చారు. బ్యాంకు పక్కనే సందులో ఉన్న గేటుకు తాళం లేకపోవడంతో ముసుగు ధరించిన ఓ దొంగ బ్యాంకు వెనుకవైపు వెళ్లి.. కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. చేతికి, ముఖానికి మాస్క్‌ వేసుకుని లోపలికి వెళ్లిన దొంగ ముందుగా క్యాష్‌ కౌంటర్‌లోకి, అటు తర్వాత స్టాఫ్‌ డైనింగ్‌ హాల్‌లోకి వెళ్లాడు. మళ్లీ 5 నిమిషాల తరువాత స్ట్రాంగ్‌ రూం వద్దకు వెళ్లి పరిశీలన చేశాడు. ఈ క్రమంలో ముందుగా తన వెంట తెచ్చుకున్న గడ్డపార, సుత్తి, ఇనుపరాడ్‌లతో స్ట్రాంగ్‌ రూంను పగులగొట్టే యత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లోని అలారం మోగింది. దీంతో బ్యాంకు వెనుక నుంచి కూరగాయల మార్కెట్‌ రోడ్డు మీదుగా మధిర రోడ్డు వరకు వెళ్లాడు. పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించగా.. చోరీ యత్నం పూర్తిగా రికార్డై ఉంది. కాగా చోరీ చేయడానికి ముందే గేటు సమీపంలో బల్బును తొలగించినట్లు, బయట ఉన్న సీసీ కెమెరాను పగలగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.  


చోరీ యత్నం జరిగిన ఆంధ్రాబ్యాంక్‌ 

పగలు రెక్కీ..  
ఆంధ్రాబ్యాంక్‌ ఎదుట ముగ్గురు వ్యక్తులు బుధవారం మధ్నాహ్నం రెక్కీ నిర్వహించినట్లు సమీపంలోని దుకాణదారులు పేర్కొంటున్నారు. బ్యాంకులో అలారం మోగకపోతే భారీ చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌  పరిశీలన 
వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ వసంతకుమార్‌ల సమాచారం మేరకు ఖమ్మం నుంచి క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందం బ్యాంకుకు చేరుకుని పరిశీలించాయి.  పోలీసులకు కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భద్రత ఏదీ? 
వైరా: ఖమ్మం జిల్లాలో బ్యాంకులనే టార్గెట్‌ చేస్తూ చోరీలకు యత్నిస్తున్నారు. వైరా, కారేపల్లి మండలాల్లో ఆంధ్రాబ్యాంక్, డీసీసీబీ, ఎస్‌బీఐ బ్రాంచిలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బ్యాంకు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఖాతాదారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఖాతాదారులు దాచుకున్న బంగారం, నగదుకు భద్రత ఉందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా పోలీసులకు ఈ చోరీ యత్నాలు సవాల్‌గా మారుతున్నాయి.

ఈ నెల 13వ తేదీన వైరా ఎస్‌బీఐ టౌన్‌ బ్రాంచిలో మెట్లపై నుంచి పైకి వెళ్లి షట్టర్‌ పగులగొట్టి మరీ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు. ఏకంగా సీసీ పుటేజీలో హార్డ్‌ డిస్క్‌లను, సీసీ కెమెరాలను తొలగించి మరీ చోరీకి యత్నం చేశాడు. ఇక్కడి బ్యాంకులో కనీసం సెక్యూరిటీ కూడా లేడు. షట్టర్‌ పగులగొడితే బ్యాంకులోకి వెళ్లాడంటే బ్యాంకు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

నెల రోజుల క్రితం కారేపల్లి డీసీసీబీ బ్యాంకులో కూడా భారీ యంత్రాలను వినియోగించి బ్యాంకులోకి చొరబడి చోరీ యత్నం చేశారు. అక్కడా కూడా భద్రత చర్యలు ఏమీ తీసుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి.

మరోవైపు బుధవారం అర్ధరాత్రి ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నం జరిపిన ప్రదేశంలో కనీసం ఉన్న గేటుకు కూడా తాళం వేయలేదు. గ్రిల్స్‌ పగులగొట్టి దొంగ సులువుగా బ్యాంకులోకి ప్రవేశించాడు. కనీసం సెక్యూరిటీ గార్డ్‌ కూడా లేడు. ఏటీఎంల వద్ద కూడా భద్రత ఉండడంలేదు. 
విచారణ చేస్తున్నాం 

ఎస్‌బీఐలో చోరీకి యత్నించింది ప్రొఫెషనల్‌ దొంగగా గుర్తించాం. విచారణ చేపడుతున్నాం. సీసీ పుటేజీలు కూడా సేకరించాం. బ్యాంకుల వద్ద బ్యాంకర్‌లు కనీసం జాగ్రత్తలు పాటించాలి. సెక్యూరిటీ గార్డ్స్‌ను రాత్రివేళ్లల్లో నియమించి భద్రత చర్యలు తీసుకోవాలి.  
జె.వసంత్‌కుమార్, సీఐ, వైరావైరా: ఖమ్మం జిల్లాలో బ్యాంకులనే టార్గెట్‌ చేస్తూ చోరీలకు యత్నిస్తున్నారు. వైరా, కారేపల్లి మండలాల్లో ఆంధ్రాబ్యాంక్, డీసీసీబీ, ఎస్‌బీఐ బ్రాంచిలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బ్యాంకు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఖాతాదారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఖాతాదారులు దాచుకున్న బంగారం, నగదుకు భద్రత ఉందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా పోలీసులకు ఈ చోరీ యత్నాలు సవాల్‌గా మారుతున్నాయి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement