పోలీసులకు సవాల్‌ | Robbery Cases Challenge To The Nagar Kurnool Police | Sakshi
Sakshi News home page

పోలీసులకు సవాల్‌

Published Wed, Nov 13 2019 9:08 AM | Last Updated on Wed, Nov 13 2019 9:08 AM

Robbery Cases Challenge To The Nagar Kurnool Police - Sakshi

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం, పరిశీలిస్తున్న ఇన్‌చార్జ్‌ ఎస్పీ అపూర్వారావు (ఫైల్‌) 

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాల్లో ఇటీవల వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంటికి  తాళాలు వేసి వెళ్లాలంటే కాస్త వెనకాముందు ఆలోచన చేస్తున్నారు. కమ్యూనిటీ  పోలిసింగ్‌లో భాగంగా పోలీస్‌శాఖ తరఫున సీసీ కెమరాలు ఏర్పాటు చేయిస్తూ.. తరచూ కార్డెన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. దొంగలు దర్జాగా వచ్చి తమ పని తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. గత నెలరోజుల్లోనే జిల్లా కేంద్రంతో పాటు, నియోజకవర్గాల్లోఇంటికి తాళం భారీ స్థాయిలో చోరీలు జరిగాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధనలో ముందడుగు వేయడంతోపాటు అసలు నేరాలే జరగకుండా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న పోలీసులకు జిల్లాలో దొంగలు 
రెచ్చిపోతూ సవాల్‌ విసురుతున్నారు. 

టెక్నాలజీ ఉన్నా.. 
సమగ్ర నేరస్తుల సర్వే పేరుతో పాత నేరస్తుల జీవన విధానం, స్థితి గతులు, వారి వివరాలు, వారికి సహకరిస్తున్న వారితో సహా వేలిముద్రలు, ఐరిస్‌ రికార్డు చేశారు. ఎక్కడ ఏ నేరం జరిగినా నేరస్తుడు ఎవరన్నది.. ఏ ప్రాంతం వాడన్నది క్షణాల్లో గుర్తించే విధంగా అధునాతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు. కాగా పోలీసులు నేర పరిశోధనలో, ముందస్తు నేర నివారణలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ దొంగతనాలు ఆగడం లేదు. నేరాలు జరిగినప్పుడు పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంతో బాగానే పరిశీలన, విచారణ చేస్తున్నా దొంగల ఆచూకీ అంతుచిక్కడంలేదు. 

సీసీ కెమెరాలు లేకనే.. 
దొంగతనాలు జరిగినప్పుడు వాటిని ఛేదించడంలో సీసీ కెమరాలు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. జిల్లా కేంద్రంలో కేవలం ప్రధాన రహదారి, ముఖ్యమైన కూడళ్లలో మాత్రమే సీసీ కెమరాలు ఏర్పాటు చేయలేదు. చాలా గ్రామాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేయకపోవడంతో దొంగలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

ఇటీవల జరిగిన చోరీలు 
►  ఈనెల 7న అర్ధరాత్రి తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ, బుద్దసముద్రంకాలనీ, అమ్మపల్లి గ్రామాల్లో దొంగలు రెచ్చిపోయారు. ఏకకాలంలో తాళం వేసి ఉన్న 11 ఇళ్లలో చోరీలు జరిగాయి. తలుపులు పగలగొట్టి 15 తులాలకు పైగా బంగారం, రూ 58 వేలకు పైగా నగదు చోరీ చేసారు. 
► ఈనెల 6న అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని రెండు వైన్‌ షాపుల్లో చోరీకి పాల్పడి రూ.27వేలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. 
►  ఈనెల 5న జిల్లా కేంద్రంలోని ఓంనగర్‌కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించడంతో ఇంటిపైన అద్దెకు ఉన్న వారు గుర్తించి కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు.  
► ఈనెల 3న నాగర్‌కర్నూల్‌ మండల పరి«ధిలోని తూడుకుర్తిలో రెండిళ్లలో దొంగలు పడి 108 తులాల వెండి గొలుసులు, కడియాలు, గొలుసులతో పాటు 4 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించారు. 
► అక్టోబర్‌ 31న బిజినేపల్లిలో కిరాణం షాపు తాళాలు పగలగొట్టి రెండు బంగారు ఉంగరాలు, నగదును తీసుకెళ్లారు.  
► అక్టోబర్‌ 20న జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో దొంగలు ఇంటి తాళాలు విరగొట్టి బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడవేసి చోరికి యత్నించారు.  
► సెప్టెంబర్‌ 25న జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఎవరూలేనిది చూసి రూ 80ల నగదును ఎత్తుకెళ్లారు.  

త్వరలోనే పట్టుకుంటాం 
చోరీలకు పాల్పడుతున్న వారిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటాం. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే జరిగిన చోరీలపై నిఘా కొనసాగుతోంది. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్‌శాఖ పనిచేస్తోంది. 
– మోహన్‌రెడ్డి, డీఎస్పీ, నాగర్‌కర్నూల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement