పట్టుబడిన నగదును మీడియా సమావేశంలో చూపుతున్న నగర సీపీ అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి ముంబైకి రవాణా చేయాలని చూసిన హుండీ నగదును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడీని హవాలా అని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన హర్షద్ భాయ్ పటేల్, ఉమేష్ బోథ్ పి.ఉమేష్ చంద్ర అండ్ కంపెనీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలోని ఆ సంస్థ ఆఫీస్‌లో గుజరాత్‌కు చెందిన విపుల్ కుమార్ పటేల్ మేనేజర్‌గా, శైలేష్ భాయ్, విపుల్, ఉపేంద్ర కుమార్ పటేల్, పటేల్ చేతన్‌కుమార్‌లు క్యాష్ ట్రాన్స్‌పోర్టర్స్‌గా, అర్జున్ లభూజీ కారు డ్రైవర్‌గా, రాజేష్ రమేశ్ భాయ్ పటేల్ పార్సిల్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈ దందాలో కమీషన్‌గా రూ.లక్షకు రూ.600 తీసుకుంటారు.
పట్టుబడ్డారిలా..
ఇటీవల నగరంలో వసూలు చేసిన రూ.5 కోట్లను ముంబై కార్యాలయానికి తరలించాల్సిందిగా వీరికి ఆదేశాలు అందాయి. దీంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతం నుంచి డబ్బు తీసుకున్న ఈ ఏడుగురూ రెండు కార్లలో ముం బైకి బయలుదేరారు. దీనిపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు బి.దుర్గారావు, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, మహ్మద్ ముజఫర్ తమ బృందాలతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వల పన్నారు. ఆ మార్గంలో వచ్చిన కార్లను తనిఖీ చేసి రూ.5 కోట్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment