
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల నుంచి ఎస్‌ఎంఎస్, ఫోన్‌కాల్, ఈ–మెయిల్‌లను అందుకుని బాధితులుగా మారిన వారిని ఇప్పటివరకు చూశాం. కానీ ఇందుకు భిన్నంగా తన స్నేహితుడికి వచ్చిన ఈ–మెయిల్‌కు స్పందించి సికింద్రాబాద్‌కి చెందిన శ్రీనివాస్ రూ.8.5 లక్షలు నష్టపోయాడు. చివరకు వ్యవహారం నగర సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు చేరడంతో మంగళవారం ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
స్నేహితుడు ప్రింట్‌ఔట్ ఇవ్వడంతో..
శ్రీనివాస్ బ్యాకింగ్ సర్వీసెస్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అతని స్నేహితుడికి ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అవసరమైన విత్తనాలు (సీడ్స్) సరఫరా చేయాలంటూ ఆ కంపెనీ అధికారి కోరినట్లు అందులో ఉంది. ఉద్యోగస్తుడైన స్నేహితుడు తనకు వ్యాపారం చేసే అవకాశం లేదని భావించి ఆ మెయిల్ ప్రింట్‌ఔట్‌ను శ్రీనివాస్‌కు ఇచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. దీంతో అందులోని ఐడీతో శ్రీనివాస్ సంప్రదింపులు ప్రారంభించాడు. సమాధానమిచ్చిన సైబర్ నేరగాడు తమ కంపెనీ భారత్‌లోని ఏజెంట్ ద్వారా వ్యవసాయదారుల నుంచి సీడ్స్ ఖరీదు చేస్తోందంటూ చెప్పాడు. ఆ ఏజెంట్ ఇటీవలే మరణించడంతో మరో ఏజెంట్ కోసం వెతుకుతున్నట్లు చెప్పడంతో శ్రీనివాస్ పూర్తిగా వారి వలలో పడ్డాడు.
కంపెనీకి తెలిస్తే తనకు ఇబ్బందంటూ..
ఆ విత్తనాలను ఉత్పత్తి చేసే వారి వివరాలు సైతం తనకు తెలుసంటూ సైబర్ నేరగాడు ఎర వేశాడు. ప్యాకెట్ రూ.56 వేలకు వ్యవసాయదా రులు సరఫరా చేస్తారని, అయితే వాటిని తమ కంపెనీతో ప్యాకెట్ రూ.1.1 లక్షల చొప్పున ఖరీదు చేయిస్తున్నానంటూ చెప్పాడు. ఈ విష యం కంపెనీకి తెలిస్తే తన ఉద్యోగం పోతుం దని, ఎవరికీ చెప్పొద్దంటూ మెయిల్‌లో సూచిం చాడు. స్థానికంగా సీడ్స్ ఖరీదు చేసి అమెరికా పంపాలని, ఎవరి వద్ద ఆ సీడ్స్ కొనాలన్నదీ తానే చెప్తానన్నాడు. తమ కంపెనీకి నెలకు 300 నుంచి 500 ప్యాకెట్లు అవసరమని, వచ్చిన లాభంలో తనకు 30 శాతం వాటా ఇవ్వా లంటూ నేరగాడు కోరాడు. కాగా, ముందుగా తనకు ఆర్డర్ ఇస్తేనే తాను స్థానికంగా సీడ్స్ కొంటానంటూ శ్రీనివాస్ చెప్పడంతో ప్రయో గాత్మకంగా ఐదు ప్యాకెట్లు పంపాల్సిందిగా సైబర్ నేరగాడు ఆర్డర్ కాపీ మెయిల్ చేశాడు. ఫలానా వ్యక్తి వద్ద ఈ సీడ్స్ లభిస్తాయంటూ ఓ ఫోన్ నంబర్ అందించాడు.
ఆర్బీఐ పేరు చెప్పి మరికొంత స్వాహా..
సైబర్ నేరగాడు ఇచ్చిన నంబర్‌లో సంప్రదించిన శ్రీనివాస్ ఐదు ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చాడు. అవతలి వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.2.8 లక్షలు డిపాజిట్ చేశాడు. కొన్ని రోజులకు కొరియర్‌లో ఐదు ప్యాకెట్ల గుర్తు తెలియని సీడ్స్ అందుకున్నాడు. వీటిని అమెరికాలో ఉన్నట్లు చెప్తున్న సైబర్ నేరగాడికి ఇతడు పంపాల్సి ఉంది. అయితే తనకు ఈ ఐదు ప్యాకెట్లకు సంబంధించిన రూ.5.5 లక్షలు చెల్లిస్తేనే పంపిస్తానంటూ ముందు జాగ్రత్త తీసుకున్నాడు. దీనికి సమ్మతించిన సైబర్ నేరగాడు ఆ డబ్బును ఆర్బీఐ ద్వారా పంపాల్సి ఉందని చెప్పాడు. అందుకు ఖర్చుల నిమిత్తం, ఇతర పన్నుల పేరుతో మరో రూ.5.7 లక్షలు డిపాజిట్ చేయించుకుని మోసం చేశాడు. ఎట్టకేలకు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.