
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను దారుణంగా చంపిన కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు. ‘నన్ను ఎలా కాల్చాడో అలానే అతన్ని కూడా కాల్చాలని’ ప్రాణంపోయే సమయంలో తన కూతురు కోరిందని ఆమె వెల్లడించారు. చనిపోయిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని చానల్స్‌లో సంధ్యపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి సోదరుడు సాయికుమార్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ.. నిందితుడు తన కూతురును రోజూ ఆఫీసుకు తీసుకువెళ్లి, తీసుకొచ్చేవాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాలని, బస్తీ వాసులను విచారిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. కార్తీక్‌కు, తన కుమార్తెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఘటనలో నిందితుడి తల్లి హస్తం కూడా ఉందన్న అనుమానం కలుగుతోందని, ఆమెను కూడా విచారించాలని కోరారు. నిందితుని ఇంటివద్దకు వెళ్లి వారి కుటుంబం గురించి విచారించగా వారు ఎంతో దుర్మార్గులని తేలిందన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంధ్యారాణి తల్లి సావిత్రమ్మ
మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ.. సంధ్యారాణి హత్య మరో ఢిల్లీ నిర్భయ ఘటన లాంటిదే అన్నారు. మరణించిన తర్వాత కూడా సంధ్యపై అసత్య ప్రచారాలు చేయడంతో ఆమె ఆత్మకూడా శాంతించదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఒక మహిళను పెట్రోల్‌పోసి తగలబెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సంధ్యారాణి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు, సంధ్యారాణి తల్లి సావిత్రమ్మకు నెలకు రూ. 5 వేల ఫించన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెండ్యాల భానుప్రసాద్, నిమ్మ బాబూరావు, ఉత్తమ్ శ్రీనివాస్, ప్రభాకర్ రావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment