
సాక్షి, హైదరాబాద్ : సంధ్యారాణి హత్యకేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఘటన దురదృష్టకరమని ...పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరించామని, కార్తీక్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
‘ఏడాది కాలంగా కార్తీక్...సంధ్యారాణిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సంధ్యారాణి అందంగా ఉండటమే కాకుండా, చక్కగా చదువుకుంది. అయితే కార్తీక్ మాత్రం ఏడో తరగతి ఫెయిల్ కావడమే కాకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. దీంతో ఆమె అతడిని కాదనుకుంది. అంతేకాకుండా కార్తీక్ వేధింపుల విషయాన్ని సంధ్యారాణి తాను పని చేస్తున్న లక్కీ ట్రేడర్స్ యజమాని దృష్టికి తీసుకు వెళ్లింది. యజమాని కూడా అతడిని మందలించాడు. కార్తీక్...సంధ్యకు ఉద్యోగం చూపించినా, ఆమె స్వశక‍్తితోనే అక్కడ రాణిస్తోంది.
అయితే సంధ్యారాణి తనను దూరం పెట్టడాన్ని సహించలేని కార్తీక్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు. 64 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి ఈ రోజు ఉదయం మృతి చెందింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశాం.’ అని తెలిపారు. మరోవైపు సంధ్యారాణి మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అందచేశారు. ఆమె మృతదేహాన్ని లాలాపేటకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment