సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె చావుకు కారణం అయిన కార్తీక్‌ను చంపేయాలంటూ మృతురాలు సంధ్యారాణి తల్లి సావిత్రి అన్నారు. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యపై కిరోసిన్ పోసి నిప్పు అంటించడంతో...తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. సంధ్యారాణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు చావుకు కారణమైన కార్తీక్ ను కూడా చంపాలి. అప్పుడే నా కూతురుకు న్యాయం జరిగినట్టు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే కార్తీక్ను శిక్షించాలి. సంధ్య ఎప్పుడు కార్తీక్ గురించి నాకు చెప్పలేదు. కార్తీక్ ఎవరో మాకు తెలియదు.’ అని అన్నారు.
సంధ్య కుటుంబాన్ని ఆదుకోవాలి
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ...ఈ రోజు ఉదయం మృతురాలు సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. నేరానికి పాల్పడ్డ కార్తీక్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి...సంధ్యారాణి కుటుంబాన్ని ఆదుకోవాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారన్నారు. ఇలాంటి ఘటనలు వారానికి ఆరు కేసులు గాంధీ ఆస్పత్రికి వస్తున్నాయన్నారు. నగరంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమించా...
సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన కార్తీక్‌ను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్యకేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సందర్భంగా కార్తీక్ పలు విషయాలు వెల్లడించాడు. ‘ అయిదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమిస్తున్నా. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కొద్దిరోజులుగా సంధ్యారాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిన్న కూడా ఆమెను బతిమిలాడాను. నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. నన్ను నిరాకరించడంతోనే కిరోసిన్ పోసి నిప్పు అంటించాను. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాను.’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment