సాక్షి, హైదరాబాద్: ఉన్మాది దాడిలో గాయపడ్డ సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు. కుటుంబ భారం తనపై ఉండటంతో అతని ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా తన పంథా మార్చుకోని కార్తీక్ నేరుగా, ఫోన్ ద్వారా వేధింపులు మొదలెట్టాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. గురువారం సం«ధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది.
తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించగా.. సంధ్యారాణి అతడిని మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు.
షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే కార్తీక్ అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈరోజు ఉదయం ప్రాణాలు విడిచింది. సంధ్య మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment