వద్దురా.. మత్తులో పడొద్దురా! | School Childrens Addicted To Drugs In Medak | Sakshi
Sakshi News home page

వద్దురా.. మత్తులో పడొద్దురా!

Published Mon, Jul 1 2019 2:08 PM | Last Updated on Mon, Jul 1 2019 2:08 PM

School Childrens Addicted To Drugs In Medak - Sakshi

సాక్షి, హుస్నాబాద్‌(కరీంనగర్‌) : మత్తు ప్రదార్థాల సేవనం అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి అలవాటైతే జీవితం నాశనమవుతుంది. అలాంటి మత్తు పదార్థాలు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు అలవాటు పడిన సంఘటన హుస్నాబాద్‌ పట్టణంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గుర్తించిన ఉపాధ్యాయులు.. 
పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలు వాడుతుండగా, అక్కడి ఉపాధ్యాయులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్‌ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు జెండా ఎగువేసేందుకు రాగా, అప్పటికే పాఠశాల తలుపులు పగులకొట్టి ఉన్నాయి. దీంతో వెలుపల చూడగా మైక్‌ సెట్‌ను మాయం కావడంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు పాఠశాల గదులను పరిశీలించారు. పాఠశాలపై అంతస్తులో బోనోఫిక్స్‌ ట్యూబ్‌లు, ప్లాస్టిక్‌ కవర్లు ఉన్నట్లుగా గుర్తించారు. కుర్చీలను తగటపెట్టినట్లుగా గుర్తించారు. ఈ విషయంపై స్థానికులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.  

ఆలస్యంగా వెలుగులోకి... 
ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఒక్కరిద్దరు విద్యార్థులు పాఠశాల వెనుకాల ఉన్న టాయిలెట్‌లో ప్లాస్టిక్‌ సంచుల నుంచి పీల్చుతుండగా బుధవారం కొంత మంది విద్యార్థులు చూశారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెబుతామని చెప్పాడు. 
దీంతో, మత్తును సేవిస్తున్న విద్యార్థి క్షణికావేశంలో సదరు విద్యార్థి షర్ట్‌ చింపి దాడి చేశారు. దాడికి గురైన విద్యార్థి స్థానిక హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు చెప్పాడు. దీంతో దాడికి పాల్పడిన విద్యార్థులను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.  

గంజాయి కంటే ప్రమాదం.. 
బోనోఫిక్స్‌ గంజాయి కంటే అతి ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.  బోనోఫిక్స్‌ను కాల్చి అందులో నుంచి వచ్చే ఆవిరిని ప్లాసిక్‌ కవర్‌లో నింపుతారు. కవర్‌లో నింపిన ఆవిరిని పీల్చుతూ విద్యార్థులు మత్తులో ఊగిపోవడం, శరీరమంతా వారి ఆధీనంలో లేకపోవడం వంటి లక్షణాలతో విద్యార్థులు మత్తులో విహరిస్తున్నారు. ఈ చెడు అలవాటు పట్టణంలోని ఎల్లంబజార్‌కు చెందిన కొంత మంది యువత నుంచి  విద్యార్థులకు పాకిందని ఇదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఉపాధ్యాయులకు చెప్పినట్లు
 సమాచారం.  

బోనోఫిక్స్‌ అంటే.
బోనోఫిక్స్‌ అనేది కేవలం ఇనుప దుకాణం, సైకిల్‌ స్టోర్లల్లో మాత్రమే విక్రయిస్తారు. ఇది సైకిల్‌ ట్యూబ్‌ను అతికించేందుకు బోనోఫిక్స్‌ను వాడుతారు. విద్యార్థులు బోనోఫిక్స్‌కు అలవాటు పడటంతో కొందరు డబ్బుల కోసం ఆఫీస్‌రోడ్‌లోని పలు దుకాణాల్లో బోనోఫిక్స్‌ను విక్రయించడం ప్రారంభించారు. దీనికి అలవాటు పడిన విద్యార్థులు ప్రతీ రోజు బోనోఫిక్స్‌ను కొనుగోలు మత్తులో జోగుతున్నారు.   

బోనోఫిక్స్‌తో అనర్థాలు.. 
బోనోఫిక్స్‌ అనే కెమిల్‌ పదార్థాన్ని వేడి చేస్తే ఆటోమెటిక్‌గా కార్బన్‌ మైనాక్సైడ్‌గా మరియు సైనేడ్‌గా మారే అవకాశం ఉంటుంది. బోనోఫిక్స్‌ ఆవిరి పీల్చడం వల్ల స్పృహ కోల్పోయి, ఉపిరితిత్తులు బ్లాక్‌ అయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ రసాయన పదార్థాన్ని పీల్చడం వల్ల మెదడ్‌లోని రక్త స్రావం గడ్డ కట్టి మనిషి ప్రాణానికే హాని కలిగించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. బోనోఫిక్స్‌ పదార్థం నీటిని, భూమిని నాశనం చేసే శక్తి ఉంటుంది. 

ఊపిరితిత్తులపై ప్రభావం 
బోనోఫిక్స్‌ అనేది కెమిల్‌. ఈ కెమికల్‌ను కాల్చి దీని నుంచి వెలువడే ఆవిరిని పీల్చడం వల్ల అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. చిన్న వయస్సులో ఇలాంటి దురాలవాట్లకు పాల్పడితే అనారోగ్యాలకు గురవుతారు. ఈ కెమిల్‌ పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు సోకి శ్వాస పీల్చుకోవడం కష్టమవువుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. చిన్న వయస్సులో ఇలాంటి కెమికల్‌కు ప్రభావితమై. జీవితాలు నాశనం చేసుకోవద్దు.  
– డాక్టర్‌ ప్రసన్న, ప్రభుత్వ వైద్యాధికారి, హుస్నాబాద్‌ 

దురలవాట్లకు ప్రభావితం కావద్దు.. 
విద్యార్థులు చిన్న వయస్సులోనే దురాలవాట్లకు పాల్పడవద్దు. బోనోఫిక్స్‌ను పీల్చుతున్నారని ప్రచారం జరుగుతుంది. విద్యార్థులు ఇలాంటి మత్తు లాంటి కెమికల్స్‌ వాడితే తదుపరి, ఇతరాత్ర డ్రగ్స్‌కు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. 
– అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, హుస్నాబాద్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement