చంద్రరాజు (ఫైల్)
కడప, రాజంపేట టౌన్ /ఒంటిమిట్ట: సంక్రాంతి వంటల కోసం పిండిని మిషన్‌లో ఆడించుకొని.. ఇంటిలో ఇచ్చిన గంటకే ఓ ఉపాధ్యాయుడు మృత్యువాత పడటంతో.. కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. రాజంపేట మండలం వైబీఎన్ పల్లె ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సంగరాజు చంద్రరాజు (50) పండగకు అవసరమయ్యే సరుకులన్నింటినీ సిద్ధం చేశారు. కొంత అనారోగ్యంగా ఉండటంతో.. ఆస్పత్రిలో చూపించుకునేందుకు కడపకు కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి దగ్గర కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని 108 ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విషాద ఛాయలు
చంద్రరాజు 1984 నుంచి ఉపాధ్యాయ వృత్తి నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో నిబద్ధతగా, అంకిత భావంతో పని చేసిన ఆయన ప్రజల మన్ననలు పొందారు. అలాగే ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొని, సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు. మండలంలోని ఉపాధ్యాయుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లో కడప రిమ్స్‌కు తరలి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment