సీజింగ్ రాజా (ఫైల్)
చిత్తూరు అర్బన్: పది రోజుల క్రితం గుడిపాల మండలంలో జరిగిన జంట హత్యల కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇందులో చెన్నైకు చెందిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల్ని అతి దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపారు. పోలీసులు రెండు రోజుల తరువాత మృతులు అశోక్, గోపినాథ్‌లుగా గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడిని గుర్తించే లోపే అయిదుగురు చెన్నై వాసులు హత్య చేసింది తామేనంటూ చిత్తూరు కోర్టులో లొంగిపోవడానికి వచ్చి పోలీసుల చేతికి చిక్కారు. క్రైమ్ స్టోరీలా మలుపులు, థ్రిల్లింగ్‌ను తలపించిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు చెన్నైకు చెందిన గ్యాంగ్‌స్టర్ సీజింగ్ రాజాగా పోలీసులు గుర్తించారు. రూ.వందల కోట్లకు పడగలెత్తిన ఇతడిని పట్టుకోవడం ఆషా మాషీ విషయం కాదని గుర్తించిన పోలీసులు కదలికలపై నిఘా పెట్టారు. అయితే అనూహ్యంగా సీజింగ్ రాజా చిత్తూరు నగరంలోనే పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడిని విచారిస్తే తెలిసిన విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
చిత్తూరులోనే మకాం..
చెన్నై తాంబరం ప్రాంతానికి చెందిన సీజింగ్ రాజా పేరు చెబితే అక్కడి వాసులకు వణుకే. భూ తగాదాలు, సెటిల్‌మెంట్‌లు, హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీల్లాంటి 32కు పైగా కేసులు ఇతనిపై నమోదయ్యాయి. నాలుగు సార్లు పీడీ యాక్టు పెడితే తమిళ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అశోక్, గోపినాథ్‌లను హత్య చేసిన తరువాత ఇతడిని పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీరు మఫ్టీలో చెన్నై, తాంబరం ప్రాంతాల్లో సీజింగ్ రాజా కోసం తీవ్రంగా గాలించారు. ఒకసారి కనిపించిన ఇతను మరోమారు చిత్తూరు పోలీసులకు కనిపించలేదు. అయితే సీజింగ్ రాజాను గుర్తించిన పోలీసులు నీడలా వెంటా డారు. ఈ క్రమంలోనే ఇతను బస్సులో చిత్తూరు నగరానికి రావడాన్ని గుర్తించారు. వెంబడించిన పోలీసులు బాలాజీ కాలనీలో సీజింగ్ రాజాను ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు.
రేషన్, ఆధార్ కార్డులు..
నిందితుడిని తమదైన శైలిలో విచారించిన పోలీసులు అతడు మాటలతో షాక్‌కు గురయ్యారు. చెన్నై ప్రాంత వాసి అయినా ఇతను చిత్తూరు నగర పౌరుడిగా కొనసాగుతున్నాడు. బాలాజీకాలనీ చిరునామాతో రేషన్‌కార్డు ఉండటంతో పాటు ప్రతీనెలా నిత్యావసర వస్తువులు కూడా సీజింగ్ రాజా తీసుకుంటున్నాడు. ఆధార్ కార్డు సైతం ఇదే చిరునామా పేరిట ఉన్నట్లు గుర్తించారు. పెగా ప్రతీ ఆదివారం చిత్తూరులో సినిమాలు చూస్తూ ఓ సాధారణ పౌరుడిగా ఎవరికీ సందేహం రాకుండా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
రెండు రోజుల్లో అరెస్టు..
జంట హత్యల కేసుతో పాటు న్యాయస్థానాన్ని, పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి యత్నించడం కింద రాజాపై చిత్తూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. హత్యలు చేసిన తీరును రాజా నుంచి పోలీసులు రాబట్టారు. హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంది. మొత్తం సాక్ష్యాలు సేకరించి రెండు రోజుల్లో రాజాను చిత్తూరులో అరెస్టు చేయడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ సుబ్బారావు, రామకృష్ణ బృందంతో పాటు చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణలను ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment