ఆరని మంటలు | Set On Fire Unnao Rape Survivor Ran For A Km Shouting For Help | Sakshi
Sakshi News home page

ఆరని మంటలు

Published Fri, Dec 6 2019 1:21 AM | Last Updated on Fri, Dec 6 2019 5:10 AM

Set On Fire Unnao Rape Survivor Ran For A Km Shouting For Help - Sakshi

గురువారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి బాధితురాలిని తీసుకొస్తున్న దృశ్యం

లక్నో/న్యూఢిల్లీ: ‘దిశ’ ఘటనపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లువెత్తుతున్నా నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిపై గురువారం వేకువజామున దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

అగ్నికీలలు దహించి వేస్తుండగానే రక్షించాలంటూ ఆమె దాదాపు కిలోమీటరు దూరం పరుగులు పెట్టారు. చివరకు బాధితురాలే 112 నంబర్‌కు పోలీసులకూ ఫోన్‌ చేసింది. ఆమె ఫోన్‌ చేసిన తర్వాతే అంబులెన్స్‌ ఘటనాస్థలానికి చేరుకొంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను ప్రభుత్వం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలించింది. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు..ఏడాది క్రితం ఆమెను రేప్‌ చేసి, అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై వచ్చిన వ్యక్తి కావడం గమనార్హం.

బాధితురాలి పరిస్థితి విషమం
బాధితురాలిని మొదట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు, తర్వాత జిల్లా ఆస్పత్రికి, ఉదయం పదింటికి లక్నో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ అశుతోష్‌ దుబే చెప్పారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం యూపీ ప్రభుత్వం ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీలోని సప్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించింది. ఆమెను సత్వరమే ఆస్పత్రిలో చేర్పించేందుకు వీలుగా అధికారులు లక్నో ఆస్పత్రి– అమౌసీ ఎయిర్‌పోర్టు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు– సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి మార్గాల్లో గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో తనపై జరిగిన అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ దయాశంకర్‌ ఎదుట బాధితురాలు వాంగ్మూలమిచ్చారు.  4.30 గంటలపుడు తన ఇంటి దగ్గర్లోని గౌరా మలుపు వద్ద హరిశంకర్‌ త్రివేది, రామ్‌కిశోర్‌ త్రివేది, ఉమేష్‌ బాజ్‌పాయ్, శివం త్రివేది, శుభం త్రివేదిలు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించినట్లు పేర్కొన్నారు. వీరిలో శివం, శుభం 2018 డిసెంబర్‌లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించగా ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా మరొకరు నవంబర్‌ 25న బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఘటనాస్థలి వద్ద ఆధారాల సేకరణ

ఖండించిన రాజ్యసభ
ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలిపై జరిగిన దాడి ఘటన రాజ్యసభలో దుమారం రేపింది. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఘటనను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య ఖండించారు. ‘యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా సరైన చర్యలుతీసుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న హింసకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ రేఖా శర్మ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందించాలని, బాధితురాలికి సరైన వైద్యం అందించాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నావ్‌ బాధితురాలిపై హత్యాయత్నంపై 12వేల మంది ట్విట్టర్‌లో ఆగ్రహం వెలిబుచ్చారు. రేపిస్ట్‌లు బెయిలుపై దర్జాగా తిరగడాన్ని కొందరు తప్పుబట్టారు.

►యూపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని కేంద్ర హోంమంత్రి, యూపీ సీఎం నిన్న అబద్ధమాడారు. నిత్యం ఇలాంటి ఘటనలను చూస్తుండటం ఆగ్రహం తెప్పిస్తోంది.
– ట్విట్టర్‌లో ప్రియాంకా గాంధీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement