
రోహితారెడ్డి మృతదేహం , ఘటనా స్థలం వద్ద రోహితారెడ్డి తల్లి హేమలతారెడ్డి
నెల్లూరు, కావలిరూరల్: అనారోగ్యంతో ఉన్న నాన్నమ్మ చూడాలంటే వెళ్తూ.. ప్రమాదవశాత్తూ రైల్లోంచి జారిపడి ఏడేళ్ల బాలిక దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన కావలి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్ల వారుజామున జరిగింది. రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సమాచారం మేరకు.. తిరుపతికి చెందిన నాగులపాటి భానుప్రతాప్‌రెడ్డి తెలంగాణలోని హన్మకొండలో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో భానుప్రతాప్‌రెడ్డి భార్య హేమలతారెడ్డి తన కుమార్తె రోహితారెడ్డి (7)ని తీసుకుని హైదరాబాద్‌లోని పుట్టింటికి వెళ్లింది. అయితే భానుప్రతాప్‌రెడ్డి తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆయన తల్లికి వైద్యం చేయించేందుకు ముందుగానే తిరుపతికి చేరుకున్నాడు. భానుప్రతాప్‌రెడ్డి తల్లి మనవరాలిని చూడాలని అనడంతో హైదరాబాద్ నుంచి హేమలతారెడ్డి తన కుమార్తె రోహితారెడ్డిని తీసుకుని నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం రాత్రి ఎస్–6 బోగీలో తిరుపతికి బయలుదేరింది.
తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో రైలు కావలి స్టేషన్ దాటాక హేమలత బాత్రూంకి వెళ్లింది. నిద్రపోతున్న రోహితారెడ్డి మెలుకువ రావడంతో తల్లిని వెతుక్కుంటూ రైలు బోగీలోని డోరు వద్దకు వచ్చి నిలబడి ఉంది. బాత్రూం నుంచి బయటకు వచ్చిన హేమలత డోరు వద్ద ఉన్న పాపను చూసి లోపలికి రమ్మని పిలిచింది. అదే సమయంలో రైలు కుదుపులకు గురికావడంతో రైల్లోంచి బయట పడిపోయింది. వెంటనే రైలు చైన్ లాగి ఆపి చూడగా రోహితారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పాపను తీసుకుని అదే రైల్లో నెల్లూరుకు వెళ్లి 108 సహాయంతో రైల్వేస్టేషన్ నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే రోహితారెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమార్తె తన కళ్ల ముందే మృతి చెందటంతో హేమలతారెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించింది. రోహితారెడ్డి హన్మకొండలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. రోహితారెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కావలి జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ శ్యామ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.