సాక్షి, హైదరాబాద్ : కోర్టు ఆదేశాల్ని ఉద్దేశ పూర్వకంగా అమలు చేయలేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహసీల్దార్ టి.తిరుపతిరావుకు హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధించింది. దీనిపై తహసీల్దార్ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు బుధవారం తీర్పు వెలువరించారు.
తహసీల్దార్ తిరుపతిరావు ఇతర రెవెన్యూ అధికారులపై 2014లో లింగమయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులో న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు 2009 నాటి రిట్‌లో పేర్కొన్న ఆస్తులను లింగమయ్య అనే వ్యక్తి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని (మ్యుటేషన్) శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను హైకోర్టు ఆదేశించింది.
దీనికి సంబంధించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని, ఆస్తులను లింగమయ్య పేరిట మార్చాకే సదరు ఆస్తులు కొనుగోలు చేసిన వారుంటే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించడానికి హైకోర్టు వీలు కల్పించింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో లింగమయ్య కోర్టు ధిక్కార కేసు దాఖలు చేశారు. తహసీల్దార్ కావాలనే మ్యుటేషన్ చేయలేదని పేర్కొన్న న్యాయమూర్తి.. తిరుపతిరావుకు జైలు శిక్ష, జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment