ఏసీబీకి పట్టుబడ్డ ఎస్‌ఐ శశిధర్
గచ్చిబౌలి: రాయదుర్గం ఎస్‌ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. శనివారం ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐ జి.శశిధర్ కొంత కాలంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. జనవరి 7న ఖాజాగూడలో నివాసం ఉండే మోహిత్ దిలీప్ మల్‌పురి గచ్చిబౌలి వెళ్లేందుకు ఓలా బైక్‌ను బుక్ చేసుకున్నాడు. దిల్‌సుక్‌నగర్‌లో నివాసం ఉండే డ్రైవర్ మురళి వరప్రసాద్ బైక్‌తో ఖాజాగూడకు వెళ్లాడు. మోహిత్‌ను పికప్ చేసుకొని గచ్చిబౌలి వెళుతుండగా ఖాజాగూడ చౌరస్తాలో బైక్ అదుపుతప్పడంతో ఇద్దరూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో మోహిత్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీనిపై జనవరి 20న రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శిశిధర్ రిమాండ్ చేస్తానని మురళిని బెదిరించి స్టేషన్ బెయిల్ కోసం రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.4 వేలకు ఇచ్చేందుకు మురళి అంగీకరించి వెంటనే రెండు వేలు ఇచ్చాడు. మరో రూ.2 వేలు ఇవ్వాల్సి ఉండగా లంచం అడుగుతున్నాడని ఏసీబీని ఆశ్రయించాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం రూ.2 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment