చింతపల్లి తపాలా కార్యాలయం
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారే జిల్లా స్థాయి అధికారుల కళ్లు కప్పి రూ.33లక్షల లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. చింతపల్లి మండల తపాలా కార్యాలయం పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, గడియగౌరారం, వింజమూరు, కుర్రంపల్లి, మధనాపురం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో తపాలా సేవలు అందుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి ఎస్‌పీఎంగా వచ్చిన ఓ ఉద్యోగి గ్రామాల్లోని బీపీఎంలకు తక్కువ నగదు ఇచ్చి ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో బీపీఎంలు ఉపాధి హామీ, పెన్షన్ తదితర సేవలు అందిస్తుంటారు. అయితే వీరికి మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం నుంచి నిత్యం లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన తపాలా కార్యాలయం ఎస్‌పీఎం, బిపిఎంలకు ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి బీపీఎంలకు మాత్రం తక్కువ నగదు ఇచ్చి జిల్లా అధికారులకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామ బీపీఎంలు ఇచ్చే రికార్డులను సరిపోల్చుతారు. దీంతో రూ.33లక్షల సొమ్ము తేడా రావడంతో తీరా ఎస్‌పీఎం సొమ్ము స్వాహా చేసినట్లు గుర్తించారు.
చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు
ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారి రూ.33లక్షల సొమ్మును స్వాహా చేయగా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టడమే కాకుండా అధికారులు అక్రమార్కున్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పకుండా విచారణ చేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారిని కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆగిన ఆసరా పెన్షన్లు
గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ను తపాలా కార్యాలయం నుంచి పంపిణీ చేస్తోంది. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఈనెల మొదటి వారం నుంచే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కార్యాలయానికి రావాల్సిన పెన్షన్ ఇప్పటికీ జమ కాలేదు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆసరా అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
సెలవుల్లో ఎస్‌పీఎం
తపాలా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారి గత వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే తేల్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జిల్లా అధికారులు జాగ్రత పడుతున్నట్లు సమాచారం. అధికారుల సూచన మేరకే సదరు ఉద్యోగి సెలవుల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment