సాక్షి, న్యూఢిల్లీ : కల్తీ మద్యం సేవించడంతో యూపీ, ఉత్తరాఖండ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరన్‌పూర్, ఖుషీనగర్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 16 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది అధికారులను సస్పెండ్ చేశామని ఖుషీనగర్ జిల్లా మేజిస్ర్టేట్ అనిల్ కుమార్ తెలిపారు.
కల్తీ మద్యం ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. కాగా, కల్తీ మద్యం సేవించిన బాధితులకు తక్షణం వైద్య సాయం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు రూ రెండు లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు. కల్తీ మద్యం సేవించిన ఘటనకు సంబంధించి రెండు జిల్లాల్లో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి, డీజీపీలను ఆదేశించారు.
కాగా,రెండు రోజుల కిందట ఆయా గ్రామాల్లో జరిగిన వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో స్ధానికులు కల్తీ మద్యం సేవించడంతో పలువురు తీవ్ర అస్వస్ధతకు గురవగా, మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 14 మంది మరణించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 13 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసినట్టు హరిద్వార్ ఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment