తమిళనాడు, తిరువళ్లూరు: వరుసకు తండ్రి అయిన వ్యక్తి నుంచి ఎదురైన లైంగిక వేధింపుల నుంచి కాపాడాలని పుళల్ ఇన్‌స్పెక్టర్‌ను ఆశ్రయిస్తే, కేసు నమోదు చేయడానికి నిరాకరించి తనపై లైంగిక దాడులకు యత్నించారని ఆరోపిస్తూ బాలిక తన తల్లితో కలిసి తిరువళ్లూరు మహిళ కోర్టును ఆశ్రయించారు. తిరువళ్లూరు జిల్లా పుళల్ సూరపట్‌కు చెందిన మహిళ (43)కు వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి నివశిస్తున్నారు. 2017లో అంబత్తూరులోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరారు. సంస్థ యజమాని వాసుదేవ జయకరన్‌తో సన్నిహితం ఏర్పడి ప్రేమగా మారింది. 2017 నవంబర్‌లో వాసుదేవను రాధిక రెండో వివాహం చేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా రాధిక వాసుదేవ జయకరన్‌తో కలిసి ఉంటోంది.
పిల్లలతో అనుచిత ప్రవర్తన: మొదట్లో మారు తండ్రి వాసుదేవ్ బాగానే ఉండేవారని తదనంతరం బాత్‌రూమ్‌లో తొంగిచూడడం, సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలను చూపిస్తూ లైంగింక వేధింపులకు గురి చేసేవాడని వాపోయిన 17 ఏళ్ల బాలిక తల్లితో కలిసి 2018 నవంబర్ 28న పుళల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన ఇన్‌స్పెక్టర్ నటరాజన్, తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు బాధితురాలు ఆరోపించింది. దీనిపై అంబత్తూరు డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి భరణీధరన్ ఎదుట హాజరై తమకు న్యాయం చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయం చేయండి: వరుసకు తండ్రి అయిన వ్యక్తి లైంగింక వేధింపులకు గురి చేస్తున్నాడు. పోలీసులను ఆశ్రయిస్తే ఇన్‌స్పెక్టర్ సైతం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బెదిరింపులకు దిగుతూ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని న్యాయమూర్తి భరణీధరన్ ఎదుట బాలిక కంటతడి పెట్టింది. తమను ప్రశాంతంగా బతకనిస్తే చాలన్న బాధితులు, ఇన్‌స్పెక్టర్ నటరాజన్, మారుతండ్రి వాసుదేవ జయకరన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి భరణీధరన్ ఇన్‌స్పెక్టర్‌ను శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment