
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): కళాశాలకు వెళ్తున్న అమ్మా.. అంటూ ఇంట్లో నుంచి బయలు దేరిన విద్యార్థిని మరు నిమిషమే మృత్యువు లారీ రూపంలో కబలించింది. అప్పటి వరకు నోరారా అమ్మా అని పిలిచిన కొడుకు క్షణంలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లి గుండెలవిసెలా రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. శనివారం ఉదయం రెబ్బెన మండలంలోని దేవులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవులగూడకు చెందిన అజ్మీర సాయిక్రిష్ణ (19) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. వివరాల్లో వెళితే.. దేవులగూడకు చెందిన అజ్మీర తుకారం, అనుషాబాయిల రెండో సంతానం అయిన అజ్మీర సాయిక్రిష్ణ ఎంఎల్‌టీ పూర్తి చేసి మంచిర్యాలలో అప్రెంటిస్ చేస్తున్నాడు.
ప్రతీరోజు బైక్‌తో ఇంటి నుంచి బయలు దేరి ప్రధాన రోడ్డు పక్కన మామ లావుడ్య వినయ్‌కుమార్ హోటల్ వద్ద వాహనాన్ని ఉంచి కళాశాలకు వెళ్లేవాడు. శనివారం సైతం మంచిర్యాలకు వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంపై వినయ్‌కుమార్ హోటల్‌కు బయలు దేరారు. సరిగ్గా అదే సమయంలో మంచిర్యాల వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళుతున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంతో వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు.
దీంతో బైక్ ఆదుపు తప్పి బోల్తాపడటంతో సాయిక్రిష్ణపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో తీవ్రగాయాలపాలైన సాయిక్రిష్ణ అక్కడిక్కడే మృతిచెందాడు. అప్పటి వరకు కళ్ల ముందే తిరిగిన కొడుకు ఒక్క నిమిషం వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి మామ వినయ్‌కుమార్ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై మల్లయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment