తోటపల్లిగూడూరు: ఫోన్లు చోరీ చేశారనే అనుమానంతో గిరిజన బాలికలను వాహనంలో తరలించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కృష్ణయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. నెల్లూరు బీవీనగర్‌కు చెందిన విద్యార్థులు సికిందర్‌బాబు, రామినేని హర్షచౌదరి, గట్టుపల్లి ప్రసాద్, కంచర్ల నవీన్, తాతిరెడ్డి రవీంద్ర గురువారం మధ్యాహ్నం వ్యాన్‌లో కోడూరు బీచ్ సందర్శనకు వచ్చారు. సముద్ర స్నానాల అనంతరం సాయంత్రం వ్యాన్లో ఉంచిన నగదు, సెల్‌ఫోన్లు మాయమైనట్లు సదరు విద్యార్థులు గుర్తించారు. అదే సమయంలో ఆ వ్యాన్ సమీపంలో ఐదేళ్లలోపు ముగ్గురు గిరిజన బాలికలు ఆడుకుంటూ వారికి కనిపించారు.
నగదు, సెల్‌ఫొన్లను బాలికలే దొంగతనం చేసి ఉంటారనే అనుమానంతో వారిని దబాయించారు. తాము చోరీ చేయలేదని గిరిజన బాలికలు ఎంత చెప్పినా వినకుండా ముగ్గురు చిన్నారులను భయపెట్టేందుకు తమ వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. అనంతరం సదరు విద్యార్థులు కోపంతో బాలికలను వ్యాన్‌లో నెల్లూరు తీసుకెళ్లే యత్నం చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తోటపల్లిగూడూరు పోలీసులు కోడూరు – నరుకూరు మార్గంలోని చింతోపు సమీపంలో వ్యాన్‌ను అడ్డగించి విద్యార్థులతో పాటు గిరిజన బాలికలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికల తల్లి కత్తి కామేశ్వరి ఫిర్యాదు మేరకు విద్యార్థులపై కేసు నమోదు చేశామని ఏఎస్సై కృష్ణయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment